దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ దేశంలో గత 24 గంటల్లో 354 కేసులు నమోదయ్యాయని చెప్పారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య 117కు చేరిందని దేశంలో 4775 కేసులు ఇప్పటివరకూ నమోదయ్యాయని చెప్పారు. ముంబై, ఢిల్లీ, ఆగ్రా మురికివాడల్లో వ్యాధి విస్తరించకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. 
 
కరోనా సామూహిక వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానంగా దృష్టి పెట్టామని అన్నారు. ఈరోజు ఒడిశాలో కరోనాతో తొలి మరణం సంభవించింది. 72 ఏళ్ల వృద్ధుడు ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యులు నమూనాల పరీక్షల్లో వృద్ధుడికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏపీలో ఈరోజు ఉదయం వరకు 304 కేసులు నమోదు కాగా... తెలంగాణలో 364 కేసులు నమోదయ్యాయి. 
 
దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తూ ఉండటంతో లాక్ డౌన్ ను పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. రాష్ట్రాల విజ్ఞప్తిపై కేంద్రం చర్చలు జరుపుతోంది. గతంలో కేంద్రం ఏప్రిల్ 14తో లాక్ డౌన్ పూర్తవుతుందని అంచనా వేసింది. కానీ రోజురోజుకు కరోనా కేసులు దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను కేంద్రం పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలలో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నారు. సీఎం జగన్ ఈరోజు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణపై సమీక్ష చేశారు. అధికారులు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన వారే అని వివరించారు. రాష్ట్రంలో హాట్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ గా సర్వే చేపట్టేలా దృష్టి పెట్టాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: