అసలే నక్కకు ఒంట్లో బాగాలేదు.. అబ్బా.. అయ్యా అని మూలుగుతోంది. ఒంట్లో సత్తువ తగ్గిపోయింది. వెళ్లి ఓ తాటి చెట్టుకింద కూర్చుని ఆపసోపాలు పడుతోంది. అదే సమయంలో బాగా పండిన ఓ తాటి పండు మాంచి స్పీడుతో వచ్చి ఆ నక్క తలపై పడితే ఎలా ఉంటుంది.. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు.

 

 

అసలే అప్పులతో ప్రస్థానం ప్రారంభించిన రాష్ట్రం. అందులోనూ గత ఐదేళ్లు పాలించిన చంద్రబాబు ఉన్న ఖజానా మొత్తం ఊడ్చి ఎన్నికల కోసం పప్పుబెల్లాల్లా పంచేశాడు. అలా అధికారంలోకి వచ్చి కాస్త కాలూ చేయీ కూడదీసుకునే లోపల ఇప్పుడు జగన్ సర్కారుపై ఈ కరోనా తాటి కాయ వచ్చిపడింది. కరోనా గిరోనా ఏమీ లేకపోయినా కూడా జగన్ సర్కారుకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

 

 

ఓవైపు ఎన్నికలకు ముందు భారీగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఈ లోపే ఆర్థిక మాంద్యం ఛాయలు దేశాన్ని కమ్మేశాయి. ఎలారా.. భగవంతుడా అని ఆలోచిస్తుండగానే ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చిపడింది. దీంతో ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనాతో రాష్ట్రానికి వచ్చే అన్ని రకాల ఆదాయ వనరులను క్షీణించాయి. లాక్‌డౌన్‌ కారణంగా 22 నుంచి రాష్ట్రంలో ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు లేవు.

 

 

రాష్ట్రానికి ఆదాయం వచ్చే ప్రధాన వనరులు ఎక్సైజ్‌, రిజిస్ట్రేషను, అమ్మకపు పన్ను, వాహన విక్రయాలు, గనులు. ఇప్పుడు వీటి అన్నింటి నుంచి ఆదాయం  ఆగిపోయింది.సాధారణ రోజుల్లో రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వారానికి వంద కోట్ల వరకూ ఆదాయం వస్తుంది. తాజా అది కేవలం మూడు కోట్లకే పరిమితం అయ్యిందంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మద్యం ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. వ్యాపారాలు లేక అమ్మకపు పన్ను ఆదాయమూ లేదు.

 

మరి ఆదాయం లేదని ప్రభుత్వ ఖర్చులు ఆగవుగా.. ఏపీకి నెలకు 15 వేల కోట్ల ఖర్చువుతుందని అంచనా. మరి ఈ పరిస్థితుల్లో ఏదీ దారి.. ఇందుకు అప్పులే పరిష్కారంగా కనిపిస్తున్నాయి. 10 వేల కోట్ల అదనపు రుణం రిజర్వు బ్యాంకు ద్వారా సమకూర్చుకునేందుకుఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని రాష్ట్రం అడుగుతోంది. మరి ఆర్బీఐ కరుణిస్తుందా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: