ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. ఈరోజు సాయంత్రం వైద్య, ఆరోగ్య శాఖ ఏడు కేసులు నమోదైనట్లు ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరిగిన కరోనా పరీక్షల్లో గుంటూరులో 3, నెల్లూరులో 4 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7 కేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439 కి పెరిగింది. 
 
ఏపీలో మూడు జిల్లాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 93 కేసులు నమోదు కాగా కర్నూలులో 84 కేసులు, నెల్లూరులో 56 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అధికారులు, ప్రజల సమిష్టి కృషి వల్లే ఈ జిల్లాలలో కేసులు నమోదు కాలేదని సమాచారం. 
 
మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది.రాష్ట్ర ప్రజలు ప్రత్యేక పాసుల సహాయంతో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పించింది. ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ ప్రకటన చేశారు. 
 
 
పాసులు కావాలనుకునేవారు వివరాలను, ధ్రువీకరణ పత్రాలను అందజేసి పాసులు పొందవచ్చు. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత పోలీస్ అధికారులు పాసులను అందజేస్తారు. పాసులు కావాలనుకునేవారు ఆయా జిల్లాల ఎస్పీల వాట్సాప్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పాసుల ద్వారా ప్రయాణాలకు అనుమతి ఇవ్వటంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: