అంబేడ్కర్ ను రాజ్యంగా నిర్మాతగా దళిత సామాజిక వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడుగా దేశం ఆయనను స్మరిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా ఒక విభిన్నమైన రాజ్యాంగాన్ని భారత్ కు అందించడానికి ఆయన 60 దేశాల రాజ్యంగాలను అధ్యయనం చేసి భారత ప్రజలకు అనుగుణంగా ఉండే రాజ్యంగాన్ని రచించిన అంబేడ్కర్ కీర్తి భారత జాతి ఉన్నంత కాలం అజరామరంగా కొనసాగుతూనే ఉంటుంది.


చాలామందికి అంబేడ్కర్ రాజ్యంగా నిర్మాతగా మాత్రమే గుర్తు ఉంటారు. కానీ ఆయన అసమాన పాత్రికేయుడు అన్న విషయం చరిత్ర పుటలలో మాత్రమే పరిమితం అయిపోయింది. అంబేడ్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకునే రోజులలోనే ఆయన అక్కడి విదేశీ పత్రికలు అన్నీ బాగా అధ్యయనం చేసి భారత దేశంలో స్వాతంత్రోద్యమ స్పూర్తిని రగిలించడానికి ఒక మంచి పత్రిక అవసరం అని ఆనాడే గుర్తించారు.


1920 జనవరి 31న అంబేడ్కర్ ప్రారంభించిన ‘మూక్ నాయక్’ పత్రికకు 2020 సంవత్సరంతో  శతాబ్దం పూర్తి అయిన సందర్భంగా ఆయన పత్రికా రచయితగా సంపాదకుడుగా సాధించిన విజయాల పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి ముందు ఈ పత్రిక జ్యోతిరావ్ పూలే స్థాపించిన ‘దీనబంధు’ ప్రభావంతో నడపబడి ఆనాటి సామాజిక దళిత ఉద్యమాలకు స్పూర్తిని ఇచ్చే పత్రిక గా స్వాతంత్రోద్యమ కాలంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. 


డాక్టర్ అంబేడ్కర్ 1951 లో కేంద్రమంత్రిగా రాజీనామా చేసారు. ఆ తరువాత తన రాజీనామాకు గల కారణాలను ఆనాటి పాత్రికేయులకు వివరిస్తూ తాను నెహ్రు మంత్రివర్గం నుండి వైదొలగడానికి మూడు కారణాలను వివరించారు. వీటిలో ఒకటి రాజకీయ కారణాలు అయితే రెండవది సామాజిక కారణాలు ఇక మూడవ కారణంగా ఆనాటి పత్రికల వ్యవహార శైలిని తప్పుపడుతూ తన రాజీనామా విషయంలో అవాస్తవాలను ప్రచురించిన ఆనాటి పత్రికల తీరు పై అంబేడ్కర్ మండి  పడ్డారు అంటే ఆనాటికే దేశంలో జర్నలిజం విలువలు తగ్గిపోయాయి అన్న విషయం ఎవరికైనా అర్థం అయి తీరుతుంది. అంబేడ్కర్ చాల పత్రికలు నిర్వహించినా ఆయన నిర్వహించిన ‘సమత’ పత్రికలో సంపాదకీయాలు చాల ఆలోచనాత్మకంగా ఉంటాయి. అంబేడ్కర్ జీవిత చివరిలో దశలో బౌద్ధమతాన్ని స్వీకరించిన పరిస్థితులలో ఆయన ‘ప్రబుద్ధభారత్’ అనే పత్రిక స్థాపించి ఆ పత్రిక ద్వారా భారతదేశంలో భౌద్ధమతాన్ని ప్రచారం చేయాలని చాల గట్టిగా ప్రయత్నించారు. ప్రముఖ లాయర్ గా సమతావాదిగా దళిత హక్కుల కోసం పోరాడిన మానవతా మూర్తిగా స్వాతంత్ర సమరయోధుడుగా అంబేడ్కర్ జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలు ఉన్నా భారత రాజ్యాంగాన్ని మలిచిన శిల్పిగా ‘భీమ్’ భారత ప్రజల హృదయాలలో చిరంజీవి..

మరింత సమాచారం తెలుసుకోండి: