మామూలు రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో ఉపాధి పొందుతున్న వారి కష్టాలు అంతాఇంతా కాదు. ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంటి అద్దె, నిత్యావసర సరుకులకోసం సామాన్యుడి జీతం వెంటనే ఖర్చయిపోతుంది. అయితే.. ప్రస్తుతం నడిచేది కరోనా కాలం. ఇటువంటి సమయంలో భాగ్యనగరంలో ఇంటి అద్దె కట్టాలంటే అదో నరకమే. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ప్రభుత్వం.. అద్దెలు అడగొద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ ఆదేశాలపై అద్దెకుంటున్నవారు హ్యాపీగా ఉంటున్నారు. యజమానులు మాత్రం కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు పెదవి విరుస్తున్నారు.

 

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో అన్ని రకాల పనులూ నిలిచిపోయాయి. బతుకు చక్రానికి బ్రేకులు పడ్డాయి. ఇల్లు గడవడానికే ఇబ్బందికరంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో కారం మెతుకులు తినైనా, గంజినీళ్లు తాగైనా పొట్ట పోసుకోవచ్చు. పూట గడుపుకోవచ్చు. కానీ... ఇంటి అద్దె కట్టకపోతే నిలువనీడ ఉండదు. ఒకటో తారీఖు రాగానే అద్దె చెల్లించకపోతే యజమాని ఒప్పుకోడు. ఇల్లు ఖాళీ చేయమంటాడు. ఇలాంటి తిప్పలేం రాకుండా... అద్దెకున్న వారు డబ్బు ఇవ్వలేకపోతే ఇబ్బంది పెట్టొద్దని ప్రభుత్వాలు సూచించాయి. టెనెంట్స్‌ విషయంలో యజమానులు ఉదారంగా వ్యవహరించాలంటున్నారు సామాన్యులు.

 

అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీసే.. సామాన్యుడికి అండగా నిలిచారు తెలంగాణ సీఎం కేసీఆర్.. కిరాయి ఉండే వాళ్లను అద్దె కోసం వేధించవద్దని ఆదేశించారు. ప్రస్తుతం ఉపాధి లేక.. జీతాలు రాక డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని... మూడు నెలల తర్వాత పరిస్థితిని బట్టి దశల వారీగా అద్దెను వసూలు చేసుకోవాలని సూచించారు. అలా అని వడ్డీ వసూలు చేయొద్దన్నారు సీఎం కేసీఆర్. టెనెంట్స్‌ను ఇబ్బంది పెట్టే ఓనర్ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు కేసీఆర్.  

 

సాధారణంగా అద్దెకు ఉండేవాళ్లంతా సామాన్య, మధ్యతరగతి కుటుంబీకులే. నెలంతా పని చేస్తే వచ్చిన జీతంతో అద్దె కట్టేవాళ్లే. పనుల్లేకపోవడంతో.. కొంతమందికి జీతం కూడా రాక అద్దె కట్టడం ఇబ్బందిగా మారింది. దీంతో... ఇప్పుడు అద్దె కట్టకపోయినా ఫర్వాలేదు... డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వండి అని చెబుతున్న ఓనర్లు కొందరున్నారు.

 

అద్దెకున్న వారు ఎన్నో ఏళ్లుగా తమ ఇంట్లో ఉంటున్నారని.. వారిని టెనెంట్స్‌లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్‌లా భావిస్తున్నామంటున్నారు కొందరు ఓనర్స్‌. ఇలాంటి కష్టకాలంలో వారిని రెంట్‌ అడిగి ఇబ్బంది పెట్టే కంటే... తీసుకోకపోవడమే మంచిదనుకుంటున్నారు. మూడు నెలల తర్వాత ప్రభుత్వం విడతల వారీగా తీసుకోమన్నదని.. కాబట్టి మాకేం ప్రాబ్లం లేదంటున్నారు యజమానులు. 

 

కొందరు ప్రైవేట్‌ ఉద్యోగులకు మార్చి నెల జీతం మొత్తం రాలేదు. లాక్‌డౌన్‌ డేస్‌ను... లాస్‌ ఆఫ్‌ పేగా పరిగణించి.. పని చేసిన రోజులకు మాత్రమే జీతాలు ఇచ్చాయి కంపెనీలు. దాంతో... అలాంటి వారి బడ్జెట్‌ తారుమారైంది. ఇలాంటి కష్టకాలంలో.. గడువు కన్నా ముందే యజమానులు అద్దె అడుగుతున్నారని.. కొందరు టెనెంట్స్‌ వాపోతున్నారు. ప్రభుత్వం 100కి కాల్ చేయమని తెలిపిందని.. అది ఆ సమయానికి సరిపోతుందని.. తర్వాత యజమాని ఇల్లు ఖాళీ చేయమంటే అప్పటికప్పుడు ఎలా అంటూ వాపోతున్నారు.

 

మొత్తం మీద మ్మీద.. ప్రభుత్వ ఆదేశాలు టెనెంట్స్‌కు కాస్త ఊరటనిచ్చాయనే చెప్పాలి. లేకుంటే చాలా మంది అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మెజారిటీ యజమానులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: