లాక్‌ డౌన్‌.. దీని దెబ్బతో అన్ని వ్యాపారాలు దివాలా తీస్తున్నాయి. ఇందుకు మీడియా కూడా మినహాయింపేమీ కాదని ఇన్ని రోజులు చెప్పుకున్నాం. అయితే ఈ లాక్ డౌన్ కాలం మాత్రం ఓ టీవీ ఛానల్ కు భలేగా కలిసొచ్చింది. అదేంటీ లాక్ డౌన్ సమయంలో టీవీ ఛానళ్లు కూడా టీవీ సీరియళ్ల నిర్మాణం ఆగిపోయి ఇబ్బందుల్లో ఉన్నాయి కదా అంటారా.. అదీ నిజమే. కానీ ఈ లాకౌ డౌన్ పుణ్యమా అని ఓ ఛానల్‌ కు టాప్ ర్యాంకులు దక్కుతున్నాయి.

 

 

ఇంతకీ ఆ ఛానల్ ఏంటంటారా.. అదే ఈటీవీ.. ఈటీవీ మొదటి నుంచి టీఆర్‌పీ రేటింగుల్లో ఓ మాదిరిగా సత్తా చాటుతూ వస్తోంది. టాప్ ప్లేస్ కోసం ఎప్పుడూ జెమినీ టీవీ, మాటీవీ కొట్టుకుంటుండేవి.. రేటింగుల రీత్యా టాప్ 30 ప్రోగ్రాముల జాబితా చూస్తే అందులో ఈటీవీకి మహా వస్తే నాలుగో, ఐదో స్థానాలు వస్తే గొప్ప అన్నట్టు ఉండేది. కానీ ఈ లాక్ డౌన్ తో సీన్ మొత్తం మారిపోయింది.

 

 

టీవీ సీరియళ్లే రేటింగులకు ప్రాణంగా ఉండే జెమిని, మా టీవీలల్లో సీరియళ్ల ప్రసారం ఆగిపోయింది. ఈటీవీయోమో.. తన పాత జబర్దస్‌ ప్రోగ్రాములు, అదే తరహాలో స్పెషల్ ప్రోగ్రాములు అన్నీ బయటకు తీసి వాడి పారేస్తోంది. అదే సమయంలో ఈటీవీ లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే 9 గంటల న్యూస్ బులెటిన్‌ కు ఇప్పుడు కరోనా పుణ్యమా అని టాప్ రేటింగ్ దక్కుతోంది.

 

 

ఇప్పుడు రేటింగ్ చార్టుల్లో ఈటీవీ 9 గంటల న్యూస్ ప్రోగ్రామ్‌ కు టాప్ ర్యాంకులు దక్కుతున్నాయి. తాజాగా ఈ వారంలో.. టాప్ 30 జాబితాలో వరుసగా 7 స్థానాలు ఈటీవీ 9 గంటల న్యూస్ బులెటిన్ దక్కించుకుందంటే.. దాని క్రేజ్ ఎలాగుందో అంచనా వేసుకోవచ్చు. అదే సమయంలో ఈటీవీ జబర్దస్త్ పాత ఎపిసోడ్లు కూడా జనం బాగానే చూస్తున్నారు. మొత్తం మీద టాప్ 30 లో గతంలో మూడు, నాలుగో స్థానాలు దక్కించుకునే ఈటీవీ.. ఇప్పుడు ఏకంగా 15 నుంచి 20 స్థానాలు దక్కించుకుంటోంది. అందుకే ఈ టీవీ కి ఈ లాక్ డౌన్ వరంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: