తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గతంలో కరోనా విపత్తు కింద తెల్ల రేషన్ కార్డుదారులకు 1500 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జనవరి, ఫిబ్రవరి, మార్చి రేషన్ బియ్యం తీసుకోనివారికి 1500 రూపాయల నగదు అందించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తేల్చింది. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 8 లక్షల మంది కరోనా నగదు సాయానికి దూరం కానున్నారని తెలుస్తోంది. 
 
మొదట రాష్ట్రంలోని 87 లక్షల కుటుంబాలకు నగదు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నెల నుంచి ప్రభుత్వం నగదు పంపిణీ సాయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వం 1314 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. లబ్ధిదారులలో దాదాపు 14 లక్షల మందికి నగదు పంపిణీ ఇంకా జరగలేదు. ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ మ్యాపింగ్ కాకపోవడంతో నగదు బదిలీ పెండింగ్ లో పెట్టినట్టు పేర్కొంది. 
 
ప్రభుత్వం పోస్టాఫీస్ సేవింగ్ ఖాతాల ద్వారా వీరికి నగదు పంపిణీ చేయనుంది. అధికారులు లబ్ధిదారుల పోస్టల్ అకౌంట్లను సేకరించి నిన్న 5,21,000 మందికి పంపిణీ చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో 8 లక్షల కుటుంబాలకు మాత్రం ఆర్థిక సాయం నిలిపివేసింది. గత మూడు నెలలు బియ్యం తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం వీరిని అనర్హుల జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి 123 కోట్ల రూపాయలు ఆదా కానున్నాయి. 
 
సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తక్కుముఖం పడుతోంది. నిన్న తెలంగాణలో కేవలం 7 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 990కు చేరింది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా కఠిన చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో మే నెల 7వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: