దేశ రాజధాని ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ పెద్దల ఖాతాలకు కోట్ల రూపాయల నిధులు వచ్చాయని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. గల్ఫ్ దేశాల నుంచి నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్, అతని సన్నిహితుల ఖాతాలలో పెద్దఎత్తున నగదు జమైందని పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అయిన కోట్లాది రూపాయల నగదు వివరాలను ఈడీ అధికారులకు అందజేశారు. 
 
గల్ఫ్ దేశాల నుంచి మౌలానా సాద్, అతని కుమారులు, అతని సోదరుడి ఖాతాలో నగదు జమైందని సమాచారం. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు మౌలానా సాద్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మౌలానా సాద్ ఫాం హౌస్ లో 2 కోట్ల రూపాయల అంతర్జాతీయ నిధులతో ఆస్తులు కొన్నట్టు తేలింది. ఈడీ అధికారులు మర్కజ్ కు నిధులు ఎలా వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
నిధులు హవాలా మార్గంలో వచ్చాయా...? మనీ లాండరింగ్ కు పాల్పడ్డారా...? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు నిజాముద్దీన్ లో నిబంధనలకు విరుద్ధంగా సమావేశం పెట్టి దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందటానికి మర్కజ్ సాద్ కారణమయ్యాడని ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నివేదికతో అధికారులు విదేశీ నిధుల రాక గురించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఇటీవల ఆయనకు కరోనా పరీక్షలు చేయగా అందులో నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. నిబంధనలను ఉల్లంఘించి మతపరమైన సమావేశాలను ఏర్పాటు చేశారని మౌలనా సాద్ తో పాటు మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను దాఖలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.                        

మరింత సమాచారం తెలుసుకోండి: