భానుడు భగభగ మండిపోతున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమై ఉపశమనం పొందుతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల వల్ల బయట కాలుమోపే వారి పరిస్థితి ఘోరంగా ఉంది. రోడ్లపై వివిధ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేవారు విధిలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. భానుడి ప్రకోపానికి చెమటలు చిందిస్తూ వ్యాపారలావాదేవీలు సాగిస్తున్నారు. రెక్కాడనిదే డొక్కాడని పరిస్థితుల్లో నాలుగు రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 

 

ఎండ తీవ్రత సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి గాలులు సైతం వీస్తుండటంతో నరకం చూస్తున్నారు. ఇక మిట్టమధ్యాహ్నం అయితే సూర్యుడు జనంపై నిప్పులు కురిపిస్తున్నాడు. లాక్ డౌన్ కొంతమేర సడలించినా గ్రీన్ జోన్లలో బయటికి రావాలంటే జనం జంకుతున్నారు.

  
ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్ల సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతుండటంతో ఉష్ణోగ్రత తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 

భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని చెబుతోంది. ఓ వైపు కరోనా విజృంభిస్తుండటంతో పాటు దానికి తోడు ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతుండటంతో జాగ్రత్త వహించాలని హితవు పలుకుతోంది. రాబోయే రోజుల్లో దేశం నిప్పుల కొలిమిలా మారబోతుందని హెచ్చరిస్తోంది. కరోనా రాకుండా ఏ విధంగా అయితే జాగ్రత్తలు వహిస్తున్నారో ఆ విధంగానే సూర్యతాపం నుంచి గట్టెక్కేందుకు ప్రికాషన్స్ తీసుకోవాలని చెబుతోంది.

 

ఇప్పటికే ఉత్తర తెలంగాణతో పాటు రాయలసీమలో సైతం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వడగాలుల ప్రభావం రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మే నెల పూర్తయ్యే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతోంది. సూర్యుడు తన ప్రతాపం నుండి  బయటపడేందుకు పండ్ల రసాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: