ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి వ్యక్తిగతంగా వచ్చే వారికి భారీ షాక్ ఇచ్చింది. తాజాగా సీఎం జగన్ లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిలో వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులనే అనుమతిస్తామని ప్రకటన చేశారు. 
 
వ్యక్తిగతంగా వచ్చేవారికి అనుమతి లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని... అధికారులు వారి వివరాలను పరిశీలించి రాష్ట్రంలోకి అవకాశం కల్పించనున్నారని ప్రభుత్వం చెబుతోంది. నిన్న సీఎం జగన్ కరోనా కట్టడి చర్యలు, లాక్ డౌన్, ఇతర అంశాల గురించి అధికారులతో చర్చించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మెరుగైన వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారు. 
 
వారికి పరీక్షలు నిర్వహించాల్సిన విధానంపై కూడా మార్గదర్శకాలను రూపొందించాలని సూచనలు చేశారు. అధికారులు వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులు స్పందన వెబ్ సైట్ తో పాటు ఇతర మార్గాల్లో కూడా విజ్ఞప్తి చేసుకున్నారని సీఎంకు తెలిపారు. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచాలని... టెలీమెడిసిన్ వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
 
సీఎం జగన్ రెడ్ జోన్లలోని మెడికల్ ఆస్పత్రుల్లో కచ్చితమైన ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించారు. తుఫాన్ రాష్ట్రం వైపు వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని... ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. సీఎస్ నీలం సాహ్ని ఇతర రాష్ట్రాల్లో ఉపాధి దొరకనివారు మాత్రమే రాష్ట్రానికి రావాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తీసుకొస్తామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: