ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్ పే పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం గూగుల్ పే డిజిటల్ చెల్లింపుల్లో సరైన మార్గదర్శకాలు పాటించడం లేదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. శుభమ్ కపాలే అనే వ్యక్తి గూగుల్‌ పే యాప్ యూపీఐ సేవలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మార్గదర్శకాలను గూగుల్ పే సంస్థ పాటించడం లేదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. 
 
 
కేంద్రాన్ని తక్షణమే గూగుల్ పే యూపీఐ సేవలను నిలిపివేసేలా ఆదేశించాలని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్ కు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. గూగుల్ పే యాప్ పనితీరుపై స్వతంత్ర విచారణ జరిపించాలని శుభమ్ కపాలే పిటిషన్ లో కోరారు. 
 
ఢిల్లీ హైకోర్టు ఆర్బీఐ, గూగుల్‌ ఇండియా డిజిటల్‌ సర్వీసెస్‌ వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గూగుల్ పే తరపున లాయర్ అఖిల్ ఆనంద్ పిటిషన్ స్వీకరించారు. లాకర్ అఖిల్ ఆనంద్ రిప్లై పిటిషన్ వేయడానికి మూడు వారాల గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయస్థానం అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ వైఖరి స్పష్టం చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
దేశంలో గూగుల్ పేకు కోట్ల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు ఈ యాప్ ద్వారా రోజూ కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. డిజిటల్ లావాదేవీల ద్వారా గూగుల్ పే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోట్ల మంది యూజర్లు ఉన్న గూగుల్ పే పై దాఖలైన పిటిషన్ విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గతంలో కూడా డిజిటిల్ లావాదేవీల యాప్ లపై ఇవే తరహా ఆరోపణలు వినిపించినా పిటిషన్లు దాఖలు కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: