2019 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత చాలామంది నేతలు టీడీపీని వదిలి బీజేపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే జగన్ అప్పుడే అధికారంలోకి రావడంతో వలసలని పెద్దగా ప్రోత్సహించే కార్యక్రమం ఏమి చేయలేదు. కానీ బీజేపీ మరింత రెచ్చిపోతున్న సమయంలో జగన్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. దీంతో వరుస పెట్టి టీడీపీ నేతలు వైసీపీలోకి వచ్చేశారు.

 

తోట త్రిమూర్తులు దగ్గర నుంచి మొదలుపెడితే మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కరణం బలరాం వరకు టీడీపీ నేతలు వరుసగా జగన్‌కు జై కొట్టారు. అయితే పదవి ఉన్నవారు రాజీనామా చేసి రావాలనే కండిషన్ పెట్టడంతో టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాంలు వైసీపీలో చేరకుండా, పరోక్షంగా జగన్‌కు మద్ధతుగా నిలిచారు. ఇక ఆ విషయం కాసేపు పక్కనబెడితే ఈ ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి. అది కూడా ప్రకాశం జిల్లా నేతలని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నేతలు...ఓ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలని, ఒక మాజీ మంత్రిని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావులు ఈ నెలాఖరికి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని టాక్. అయితే ఇక్కడే వైసీపీకి రివర్స్ షాక్ తగిలే అవకాశముందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

 

తమ నేతల వ్యాపారాలపై దెబ్బకొట్టి వారిని ఒత్తిడి పెట్టి వైసీపీ నేతలు లాగేసుకోవాలని చూస్తున్నారని, ఇక ఆ ఒత్తిడి తట్టుకోలేక కొందరు పార్టీ మారే అవకాశం లేకపోలేదని, కానీ పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు పార్టీ మారడం అనేది జరగదని వాదిస్తున్నారు.  చంద్రబాబుకు విధేయుడుగా ఉండే ఏలూరి మాత్రం పార్టీ మారడం జరగని పని అని, ఆ విషయం ఆయన్నే డైరక్ట్‌గా అడిగితే తెలుస్తోందని అంటున్నారు. మరి చూడాలి వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో ఎందరు టీడీపీ నేతలు చిక్కుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: