ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. కరోనా విజృంభణతో కేంద్రం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలామంది వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చారు. పోలీసులు అలాంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేశారు. 
 
తాజాగా ఈ వాహనాల గురించి సీఎం స్పందించారు. వాహనదారుల నుంచి 100 రూపాయలు ఫైన్ వసూలు చేసి వాహనాలను విడిచిపెట్టాలని చెప్పారు. మరోసారి నిబంధనలు ఉల్లంఘించబోమంటూ వాహనదారుల నుంచి అంగీకార పత్రాన్ని తీసుకోవాలని చెప్పారు. వాహనాలను వాహనదారులకు తిరిగి ఇచ్చే సమయంలో కరోనా వైరస్ జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వేల సంఖ్యలో వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. 
 
లాక్ డౌన్ లో పట్టుబడిన వాహనాలను తిరిగి అప్పగిస్తామని తెలిపారు. వాహనాలకు సంబంధించిన పత్రాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని తెలిపారు. ఇప్పటికే ఈ విషయం గురించి జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. జరిమానాలు చెల్లించి ఎవరి వాహనాలను వారు తీసుకుపోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ప్రజా రవాణా ప్రారంభమవుతోంది. 
 
తెలంగాణ రాష్ట్రంలో కూడా లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయడానికి పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 47 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2561కు చేరింది. వీరిలో 1776 మంది డిశ్చార్జ్ కాగా 56 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: