ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ పలు రాష్ట్రాల ప్రజల్లో భయాందోళన పెంచుతుంది. దేశంలో గత ఐదురోజులుగా ప్రతిరోజూ 6,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ 6,000కు కేసులు నమోదవుతూ ఉందంటే వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. 
 
దేశంలో నిన్న ఒక్కరోజే 6,535 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1,45,380గా ఉంది. వీరిలో ఇప్పటివరకు 4,167 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో లక్ష కరోనా కేసులు నమోదు కావడనికి రెండు నెలల సమయం పట్టగా వారం రోజుల్లోనే 45,000 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా మూడు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 
 
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో మహమ్మారి తీవ్రత వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ పదవ స్థానంలో ఉంది. దేశంలో ఇప్పటివరకు 60,491 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 80,727 మంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా భారీన పడి చికిత్స పొందుతున్నారు. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 48 మంది కరోనా భారీన పడినట్టు వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2719కు చేరింది. గడచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 57కు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్నటివరకు 1920 కరోనా కేసులు నమోదు కాగా 56 మంది మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: