ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణతో భారత్ ఇబ్బందులు పడుతున్న తరుణంలో మిడతల దండు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. మిడతల దండు రాష్ట్రంలోకి రాకుండా తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఐదుగురు అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఎక్కడైనా మిడతల దండు కనిపిస్తే 1800 425 1110 నంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు. 
 
రాజస్థాన్ రాష్ట్రం నుంచి మన దేశంలోకి ప్రవేశించిన మిడతలు మహారాష్ట్రలోని భండార మీదుగా బాలాఘాట్ వైపు వెళుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి మిడతల దండు గాలి దక్షిణం వైపు మళ్లితే తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకి మిడతల దండు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సరిహద్దు జిల్లాల కలెక్టర్లను హెచ్చరించామని... పోలీస్ అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. 
 
మిడతల దండును రాష్ట్ర సరిహద్దుల దగ్గరే ఫైర్ ఇంజిన్లు, జెట్టింగ్ మిషన్లు, పెస్టిసైడ్ల సహాయంలో నిరోధించాలని సర్కార్ భావిస్తోంది. నిన్న సీఎం కేసీఆర్ మిడతల దండు రాష్ట్రానికి వస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలో మిడతల దండు ప్రవేశం నుంచి మిగిలిన అంశాల వరకు సీఎం విసృతంగా చర్చించారు. మిడతల దండుకు గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటు ఉండటంతో రాష్ట్రానికి మిడతల దండు వచ్చే అవకాశాలు తక్కువని వారు చెబుతున్నారు. 
 
మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. మిడతల దండు మామిడి పండ్ల తోటలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మిడతలు ఆకులు, పువ్వులు, పళ్లు, విత్తనాలను నాశనం చేస్తాయని... మిడతల దండు వల్ల పళ్లు పండించే రైతులకు తీవ్ర నష్టమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గడచిన 27 సంవత్సరాలలో ఈ ఏడాది మిడతల దాడి అతి పెద్దదని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: