దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. వాతావరణ శాఖ ఐదు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చంఢీఘర్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించటంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు మధ్యాహ్న సమయంలో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మండిపోతుండటంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 7.30 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో నిన్న 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈరోజు కూడా 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 
 
దేశంలోని ఢిల్లీ, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని చురులో అత్యధికంగా 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా శీతల ప్రాంతమైన జమ్మూలో మాత్రం 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు మండిపోతూ వడగాలులు వీస్తుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. 
 
జూన్ 1వ తేదీ నాటికి దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. రేపు ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల సకాలంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా శింగనమలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కూడా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి         


మరింత సమాచారం తెలుసుకోండి: