దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా మృతుల సంఖ్య, బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నేటితో లాక్ డౌన్ 4.0 ముగియనుండగా ఐదో విడత లాక్ డౌన్ ను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్ డౌన్ 4.0 ను అమలు చేసిన కేంద్రం ప్రస్తుతం అన్ లాక్ 1 పేరుతో లాక్ డౌన్ నిష్క్రమణకు రంగం సిద్ధం చేసింది. 
 
కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ అమలు కానుండగా ఇతర ప్రాంతాల్లో మాత్రం దశల వారీగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. జూన్ 8వ తేదీ నుంచి ప్రార్థన మందిరాలు, మతపరమైన స్థలాలు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. షాపింగ్ మాళ్లు, ఆతిథ్య సేవలు, రెస్టారెంట్లు, హోటళ్లు జూన్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్రం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమలు చేస్తోంది. 
 
రాష్ట్రాల మధ్య వ్యక్తులు, వస్తు రవాణా విషయంలో ఆంక్షలను పూర్తిగా సడలించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్ల ప్రారంభం గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల అనంతరం జులైలో నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, అంతర్జాతీయ విమాన సర్వీసులపై పరిస్థితులను బట్టి తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. 
 
ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ను వినియోగించేలా జిల్లా యంత్రాంగాలు మరింత దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది. 65 ఏళ్ల వయస్సు పై బడిన వారు, 10 ఏళ్ల లోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కేంద్రం సూచించింది. రైళ్లు, విమాన సర్వీసుల గురించి ఎప్పటికప్పుడు నియమావళిని జారీ చేస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం ఇతర రాష్ట్రాలకు పాసులు అవసరం లేదని చెప్పడంతో వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: