ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఒకరికి ఇద్దరు.. ఇద్దరికి ముగ్గురు అన్నట్టుగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఇటు సచివాలయంలోనూ.. అటు అసెంబ్లీలోనూ ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఈ స్థాయిలో ఉండడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. దీంతో  సచివాలయం నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కల్పించాలంటూ సీఎస్‌ నీలం సాహ్నీని కోరుతున్నారు ఉద్యోగులు. 

 

కరోనా వైరస్‌ ఏపీ సచివాలయ ఉద్యోగులను వణికిస్తోంది. హైదరాబాద్‌ నుంచి పది బస్సుల్లో ఏపీకి వచ్చిన వారికి కరోనా టెస్టులు నిర్వహించడంతో ఉద్యోగుల్లో కరోనా వైరస్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా వ్యవసాయ శాఖలో విధులు నిర్వహించే ఓ ఉద్యోగికి కరోనా వైరస్‌ వచ్చినట్టు గుర్తించారు. దీంతో వ్యవసాయ శాఖ ఉన్న నాలుగో బ్లాకుతో పాటు క్యాంటీన్ ఉన్న మూడో బ్లాకునూ ఓ రోజు మూసేసి.. ఈ రెండు బ్లాకుల్లో పూర్తిగా డిసిన్ఫెక్షన్‌ కార్యక్రమం చేపట్టారు. 


అలాగే సచివాలయం మొత్తం డిసిన్ఫెక్షన్‌ కార్యక్రమం చేపట్టింది వైద్యారోగ్య శాఖ.  హైదరాబాద్‌ నుంచి బస్సుల్లో వచ్చిన వారికే కాకుండా.. మొత్తం అందరికీ కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 600 మందికి పైగా కరోనా టెస్టులు చేయించుకున్నారు. 

 

వ్యవసాయ శాఖలో కరోనా సోకిన ఉద్యోగి కాంటాక్ట్‌ ట్రేస్ చేసింది వైద్యారోగ్య సిబ్బంది. వారిలో జీఏడీ పని చేసే ఓ ఉద్యోగికి.. అలాగే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే మరో ఉద్యోగికి కరోనా సోకిందని నిర్ధారణ అయింది. ఇక ఇప్పటికే వ్యవసాయ, సహకార శాఖలకు చెందిన ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే.. అందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఉద్యోగులు . మరోవైపు అసెంబ్లీలో విధులు నిర్వహించే ఓ ఏపీఎస్పీ కానిస్టేబుల్‌కు కూడా కరోనా సోకింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: