నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొద్దిరోజుల క్రితం వైసిపిపైన, ఆ పార్టీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రాజు గారి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ ఎవరూ, ఎక్కడా అసంతృప్తి రాగం వినిపించకుండా, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్న వైసీపీలో ఇప్పుడు ఒక్కసారిగా రాజు గారి మాటలు కలకలం రేపాయి. జగన్ అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరికీ దొరకడం లేదని, కేవలం ఇద్దరు, ముగ్గురు కోటరీ నాయకులకు మాత్రమే జగన్ దర్శనం లభిస్తోందని, రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని, అనేక అవినీతి కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిని జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం దొరకడం లేదని, జగన్ అపాయింట్ మెంట్ కోసం ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు అని ఇలా ఎన్నో విషయాలపై రఘురామకృష్ణంరాజు గొంతెత్తారు.

 

 రఘురామకృష్ణంరాజు ఈవిధంగా మాట్లాడటం వెనుక బీజేపీ ఉందని, ఆయన బిజెపిలో చేరేందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు వైసిపి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, దానికి ఆయన ఘాటుగా రిప్లై ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్ గానే తీసుకుంది. రాజు గారు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదని, ఇప్పటికే జగన్ అపాయింట్మెంట్ దొరకక  చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైసిపి గుర్తించి ఇప్పుడు రోజుకు 10 మంది వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అపాయింట్మెంట్లు జగన్ తీస్తున్నారట. 


నియోజకవర్గ సమస్యలను చెప్పుకునేందుకు వారికి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని, నాసిరకం ఇసుక, రవాణా ఛార్జీలు అదనపు భారంతో మరింతగా సమస్య పెరిగిందని, జనాలు తీవ్ర అసంతృప్తి ఉన్నారనే విషయాన్ని వైసిపి గుర్తించి ఇప్పుడు ఇసుక పాలసీలో మార్పులు చేసేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైసీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఆనందం వ్యక్తమవుతోంది. రఘురామ కృష్ణంరాజు బహిరంగంగా ఈ అంశాలపై వ్యాఖ్యానించి పార్టీ గీత దాటినా, ఆయన మేలు చేశారని, లేకపోతే పరిస్థితిలో మార్పు వచ్చేది కాదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారట. 

ఈ వ్యవహారం పై స్పందించిన రఘురామకృష్ణరాజు.. ఇప్పుడు జగన్ లో మార్పు రావడానికి కారణం తానేనని, ఇప్పుడు జగన్ అందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారని, ఆ విధంగానే త్వరలో తనకు కూడా అపాయింట్మెంట్ ఇస్తారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: