కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించినా తమకు వాహన పన్ను పోటు తప్పట్లేదని టూరిస్ట్ ట్రావెల్స్ యజమానులు వాపోతున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి మారటోరియం ఇచ్చిన విధంగా తమకు సైతం వాహన పన్ను రద్దు చేయడంతో పాటు ఇన్సూరెన్స్‌ ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

గడిచిన మూడు నెలలుగా ఎలాంటి పని లేక.. ఇంటికే పరిమితమైన టూరిస్టు బస్సుల యజమానులు టాక్స్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో మార్చి 24నుంచి ఒక్క టూరిస్టు బస్సు కూడా రోడ్డు ఎక్కలేదని... అయినా కానీ ప్రభుత్వం త్రైమాసిక పన్ను కట్టాలని ఒత్తిడి తెస్తోందంటున్నారు.  వాహనాలు తిరిగిన, తిరగకపోయినా పన్నులు చెల్లించాల్సి రావడంతో తాము లక్షల్లో నష్టపోతున్నామని ట్రావెల్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, గుజరాత్‌, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మాఫీ చేసినట్లు సమాచారం ఉందని, అదే తరహాలో మన ప్రభుత్వం క్వార్టర్‌ ట్యాక్స్‌ మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ట్యాక్స్‌ మాఫీతో పాటు, పుల్‌ ఇన్యూరెన్స్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

 

తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లో సుమారు నాలుగు వేల టూరిస్ట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ఒక్కో బస్సులోని ఒక సీటుకు తెలంగాణలో 3675 రూపాయలు త్రైమాసిక ట్యాక్స్ రవాణా శాఖ వసూలు చేస్తుండగా... ఏపీలో ఒక్కో బస్సులోని ఒక సీటుకు 3,770 రూపాయల చొప్పున పన్నులు వసూలు చేస్తున్నారు. ఒక్కో బస్సులో 40 నుంచి యాభై సీట్లు ఉంటే లక్షా అరవై వేల నుంచి లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టాల్సి ఉంటుంది. అయితే గడిచిన మూడు నెలలుగా ఒక్క ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కూడా రోడ్డెక్కలేదు. అయినా కూడా బస్సులకు సంబంధించిన ట్యాక్స్ కట్టాలని రెండు రాష్టాల ప్రభుత్వాలు తమపై ఒత్తిడి పెంచుతున్నాయంటున్నారు బస్సు యజమానులు. 

 

కరోనా నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ ఆఖరు వరకు బస్సులు నడపబోమని కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్‌ యాజమాన్యాలు రవాణా శాఖకు ముందస్తుగా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఏపీకి చెందిన 1600 బస్సుల్లో సగానికి పైగా... తెలంగాణకు చెందిన 800 బస్సులు పూర్తిగా నడపబోమని యజమానులు తెలిపారు. అయితే రవాణా వాహనాలు 8 నెలలపాటు నడపకూడదని భావిస్తే.. త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు తొలి త్రైమాసికంలో పన్ను మినహాయించాలంటే మార్చి చివరి నాటికే దరఖాస్తు చేసుకోవాలి. కానీ మార్చిలో లాక్‌డౌన్‌ విధించడం, ప్రజా రవాణాపై ఆంక్షలు ఉంటాయని భావించిన కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్‌ యాజమాన్యాలు చాలావరకు బస్సులు నడపమని తేల్చి చెప్పాయి. రవాణాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లోనే కాకుండా, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల స్వీకరణకు అవకాశమిచ్చారు. దీంతో ఏపీలో 400లకుపైగా బస్సులకు సంబంధించి వాటి యాజమాన్యాలు జూన్‌ వరకు నడపబోమని తెలియజేస్తూ త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు పొందాయి. ప్రైవేట్ ట్రావెల్స్ యజమాన్యం నిర్ణయంతో జులై మొదటి వారం వరకు బస్సులు పూర్తిస్థాయిలో తిరగడం సాధ్యం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో ప్రయివేటు టూరిస్టు బస్సులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఒకవైపు అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతిపై స్పష్టత ఇవ్వడం లేదని యజమానులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: