తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతుండగా మరోసారి లాక్ డౌన్ ను ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 
 
అయితే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలే ఆయనకే సమస్యలు సృష్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా భారీన పడుతున్నారు. దీంతో గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియా హైలెట్ చేస్తోంది. ఏ సోషల్ మీడియా టీ.ఆర్.ఎస్. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైందో అదే సోషల్ మీడియా వేస్తున్న ప్రశ్నలు నేడు ప్రభుత్వానికే తగులుతున్నాయి. రోగులు వీడియోలు తీస్తూ చేస్తున్న పోస్టులపై ఈటల ఘాటు విమర్శలు చేశారు. 
 
ఈ విమర్శలపై కూడా నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆక్సిజన్ అందక గుండెనొప్పితో ఒక వ్యక్తి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకోవడం మాని దబాయింపులకు పాల్పడుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ మాట్లాడిన పలు మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 
 
22 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో వైరస్ బ్రతకదని కేసీఆర్ చెప్పారని..... గచ్చిబౌలిలో కరోనా ఆసుపత్రి గురించి చెప్పాలని.... లక్ష కోట్లైనా ఖర్చు చేస్తానని చెప్పిన సీఎం నేడు కరోనా రోగుల కోసం ఖర్చు చేయట్లేదని... కరోనా పరీక్షలు చేయాలన్నా చేయడం లేదని... ఏప్రిల్ 7 తర్వాత కరోనా ఉండదని సీఎం చెప్పారని.... ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులు..... ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రైవేట్ ఆస్పత్రులా....? అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.                            

మరింత సమాచారం తెలుసుకోండి: