జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒక ఎంపీకి షాక్ ఇచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 253 ఎకరాల భూమిని వెనక్కి తీసేసుకుంది. గల్లా జయదేవ్ కు చెందిన అమర్ రాజా ఇన్‌ఫ్రాటెక్ అనే సంస్థకు 2010లో అప్పటి ప్రభుత్వం దాదాపు 500 ఎకరాల భూములు కేటాయించింది. ఇప్పుడు ఆ భూమిలో నుంచి 253 ఎకరాలను జగన్ సర్కారు వెనక్కి తీసేసుకుంది.

 

 

వాస్తవానికి పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను పారిశ్రామిక అవసరాల కోసమే వాడాలి. అంతే కాదు.. ఇచ్చిన భూమిని సక్రమంగా వినియోగించాలి. కానీ.. ఈ కంపెనీ తనకు ఇచ్చిన భూమిని దాదాపు పదేళ్ల నుంచి వృథాగా ఉంచుతోంది. ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. దీంతో ప్రభుత్వం ఆ భూమిని వెనక్కు తీసేసుకుంది.

 

 

ఇలా చేసేందుకు ప్రభుత్వానికి అన్ని హక్కులూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ కంపెనీ ఓ టీడీపీ ఎంపీది కావడంతో సమస్యకు రాజకీయ రంగు పులుముకుంటోంది. జగన్ సర్కారు ఈ చర్య ఎందుకు తీసుకుంది అంటే అందుకు అనేక సమాధానాలు కనిపిస్తున్నాయి. ఏపీఐఐసీ సహజంగా తాను కేటాయించిన భూములను సమీక్షించుకునే ప్రకియలో ఇది భాగం కావచ్చు.

 

 

కానీ ఏకంగా 253 ఎకరాల విషయం కావడంతో ఇది రొటీన్ ప్రక్రియ కాదని.. ప్రత్యేక దృష్టితో చేసిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే.. టీడీపీలోని పారిశ్రామిక వేత్తలకు ప్రమాద ఘంటికలు మోగినట్టే. మరి ఇప్పుడు గల్లా జయదేవ్ ఏం చేస్తారు.. ఇప్పటి వరకూ ఆయన ఈ అంశంపై స్పందించలేదు. కక్ష సాధింపు అంటూ మీడియా ముందుకు వస్తారా.. లేదా.. కార్పొరేట్ తరహాలో రాయబారం నడుపుతారా.. లేదా.. ఎలాంటి బెదిరింపులకైనా బెదిరేది లేదంటూ పోరుబాట సాగుతారా.. చూడాలి.. గల్లా ఏం చేస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: