పార్టీలకు అతీతంగా యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న లీడర్లలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఒకరు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి, స్వల్ప మెజారిటీ తేడాతో లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయినా నిత్యం జనంలోనే ఉంటూ బలమైన యువనేతగా ఎదిగారు. అతని క్రేజ్ చూసిన పార్టీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో, మంచి మెజారిటీతో గెలుపొందారు.
గెలిచిన దగ్గర నుండి ప్రజలకు మరింత చేరువయ్యి తన సొంత ఖర్చులతో రైతులకు బోర్లు వేయించడం, ఎవరికి ఏ అవసరం ఉన్నా సాయం చేస్తూ తనకున్న క్రేజ్‌ని మరింత పెంచుకున్నారు. వంశీ సారథ్యంలో నియోజకవర్గ వర్గంలోని తెలుగు తమ్ముళ్లు మరింత ఉత్సాహంగా పనిచేశారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన జగన్ గాలిలో సైతం పోరాడి గెలిచి మరోసారి తన సమర్థత నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఘోరంగా పరాజయం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ కూడా కూలబడిపోయినట్టైంది.
కానీ గన్నవరంలోని తెలుగుతమ్ముళ్ళు మాత్రం తమకి వంశీ ఉన్నాడన్న ధైర్యంతో నిలబడ్డారు. కానీ సడన్‌గా వంశీ ఇచ్చిన షాక్‌తో వాళ్ళు కూడా ఖంగుతిన్నారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ హయాంలో నకిలీ ఇళ్ళ పట్టాలు పంచి ప్రజలని మోసం చేశారని వంశీపై వదంతులు వచ్చాయి. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న వంశీ.. అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్ సీపీకి మద్ధతు తెలిపారు. అంతటితో ఆగకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, కృష్ణా టీడీపీ నేతలని ఇష్టమొచ్చినట్లు తిట్టేశారు. ఇక ఎంతగానో అభిమానించిన తమ నేత ఇలా చెయ్యడం తెలుగుతమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోయారు.
కాకపోతే వంశీ వైఎస్సార్‌సీపీ వైపు వెళ్ళాక గన్నవరంలో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా గన్నవరం బాధ్యతలు గద్దె అనూరాధని స్వీకరించమని బాబు చెప్పగా ఆమె నిరాకరించినట్టు తెలుస్తోంది. ఒకవేళ భవిష్యత్‌లో వేరే నాయకుడు వచ్చినా కూడా తమ్ముళ్ళు వంశీకి ఇచ్చిన విధంగా సపోర్ట్ ఇవ్వడం కష్టం. అందుకే భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీపై ఏమన్నా వ్యతిరేకత పెరిగితే వంశీ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తారనే ఆశతో ఉన్నారు. మరి వారి ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి