అపర చాణిక్యుడు గా పేరుపొందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక పట్టాన అర్థం కావడం లేదు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎంతో మంది ఉద్దండులను ఎదుర్కొన్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పార్టీని ఈ స్థాయికి తీసుకు వచ్చారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు తన కొడుకు వయసుతో సమానమైన జగన్ ను ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదనే విషయాన్ని అర్ధం చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా, రాజకీయ ఒడిదొడుకులను ఆయన ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలంలోనే పార్టీకి చెందిన కీలక నాయకులంతా, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, జైలు జీవితం గడుపుతున్నారు. మిగతా నాయకులు యాక్టివ్ గా లేకపోవడం వంటి పరిణామాలు గందరగోళం కలిగిస్తున్నాయి.
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, మరో నాలుగేళ్ల పాటు ఏ విధంగా అధికార పార్టీని ఎదుర్కోవాలి అనేది అంతు పట్టని విషయంగా మారింది. అసలు మొదటి నుంచి జగన్ ను చంద్రబాబు తక్కువ అంచనా వేస్తూ వచ్చారు. ఆయనపై గతంలో నమోదైన అవినీతి కేసుల కారణంగా, ఆయన భయపడి పోతారని, రాజకీయంగా సైలెంట్ అయిపోతారు అని, ప్రజలు ఆయన్ని అవినీతిపరుడిగానే చూస్తూ, తమకే పట్టం కడతారని, ఇలా ఎన్నో రకాలుగా అంచనాలు వేసుకున్నారు. కానీ, జగన్ మాత్రం కోర్టులకు హాజరవుతూనే, మరోపక్క పాదయాత్ర చేస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుని జనాలకు భరోసా కల్పించి ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికార పీఠం దక్కించుకున్నారు.
ఇక అధికారంలోకి అవినీతి వ్యవహారాలకు తాను దూరంగా ఉండడమే కాక, పార్టీ నేతలెవరూ అవినీతి వ్యవహారాల్లో పాలుపంచుకోకుండా చూడగలగడంలో సక్సెస్ అయ్యారు. అలాగే ప్రజలకు ఏ అవసరం వచ్చినా, అంతకు ముందు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండే వారు. సకాలంలో ఎవరి పనులు పూర్తయ్యేవి కాదు. సిపార్సులు ఉన్నవారికే పనులు అవుతాయి అనే అభిప్రాయం ఉండేది. కానీ విప్లవాత్మకమైన మార్పులతో జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థ ను తీసుకురావడం, ఎవరూ గడప దాటి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ పథకాలు అనీ, ఇంటి కే వచ్చి చేరుతుండటం, ఇలా ఎన్నో అంశాలు ప్రజల్లో జగన్ ను బలమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి.
ప్రస్తుతం భవిష్యత్తు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న తెలుగుదేశం నాయకులకు ఇదే జీర్ణించుకోలేని అంశంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అంతా రిటైర్మెంట్ వయస్సు దాటి పోయిన వారే, యువ నాయకులకు పార్టీపై అంతగా అంకితభావం లేకపోవడం, ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని పరిస్థితి ఉండడం, మొదలైన అంశాలన్నీ బాబుకు అంతుపట్టని విధంగా మారాయి. ఇక తన రాజకీయ వారసుడు పని తీరుపైనా, పెద్దగా సంతృప్తి లేదు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడం వంటి పరిణామాలతో, తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీనం అయిపోయింది. ఇప్పుడు జగన్ ని ఎదుర్కోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అనేలా పరిస్థితి ఉండడంతో, ముందు ముందు భవిష్యత్తు శూన్యంగానే చంద్రబాబుకు కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి