వరదలతో అసోం చిగురుటాకులా వణికిపోతుంది. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ప్రమాదకరస్థాయి మించి పారుతున్నాయ్. 2500 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఓవైపు కరోనా మహమ్మారి..!! మరో వైపు వరద..!! అసోంను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో... నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా వరద నీళ్లే. నీట మునిగిన ఇళ్లే కన్పిస్తున్నాయి.
అసోంలో మొత్తం 33 జిల్లాలుంటే... 24 జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతుంది. 70 లక్షల మంది ముంపునకు గురయ్యారు. 2500 గ్రామాలు నీట మునిగాయి. నాలుగున్నర లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు . 50వేల మంది 521 రిలీఫ్ కేంద్రాల్లో సేద తీరుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది.
బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ఉప్పొంగిపారుతున్నాయి. మంగళవారం నాటికి బ్రహ్మపుత్ర మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ముందస్తు చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఆ రాష్ట్ర సీఎం శర్బానంద సోనోవాల్.
ఇటు ఖజిరంగా నేషనల్ పార్కు 85శాతం నీట మునిగింది. ఇప్పటి వరకు 108 జంతువులు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వందకు పైగా జంతువులను రక్షించినట్లు తెలిపారు. ఆరు రైనోలు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు చెప్పారు. ప్రాణభయంతో జంతువులు పార్కును దాటి బయటకు వస్తున్నాయి. టీ గార్డెన్ లు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు ప్రకటించారు.
మొత్తానికి అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్ర, బరాక్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఇప్పటికే లక్షలాది మంది నివాసాన్ని కోల్పోయారు. వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం జంతుప్రేమికులను కంటతడి పెట్టిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి