అయోధ్య నగరంలో రామమందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. వచ్చే నెల 5న రామజన్మభూమి దగ్గర భూమిపూజతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. బీజేపీ కురువృద్ధ నేతలు అడ్వాణీ, ఎంఎంజోషీలూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది.
ప్రధాని మోదీ 40 కిలోల వెండి ఇటుకతో శంఖుస్థాపన చేయనున్నారు. ట్రస్టు శంఖుస్థాపన దృశ్యాలను అయోధ్య వాసులు తిలకించేందుకు భారీగా స్క్రీన్లు ఏర్పాటు చేయబోతుందని తెలుస్తోంది. ఆగస్టు 3 నుంచి అయోధ్యలో వేదోక్తంగా కార్యక్రమాలు మొదలవుతాయి. మోదీకి ఇప్పటికే ఆహ్వానం అందగా ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రధానమైన భూమిపూజకు ముహూర్తం ఖరారైంది.
దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటం వల్ల శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానితులు భౌతికదూరం పాటించేందుకు ఏర్పాట్లు చేయనుంది. రామాలయ ఉద్యమంతో సంబంధం ఉన్న కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా రామాలయం నిర్మాణం పనులు కొంత ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి.
మోదీ ఆయోధ్య నగరంలో దాదాపు మూడున్నర గంటలపాటు ఉండవచ్చని తెలుస్తోంది. భూమిపూజ అనంతరం ప్రధాని హనుమాన్ టెంపుల్, సరయూ నదిని సందర్శించే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 5న అభివృద్ధికి సంబంధించిన పలు శంకుస్థాపన కార్యక్రమాలకు మోదీ హాజరుకానున్నారని తెలుస్తోంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ అయోధ్యను సందర్శించటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయోధ్యలోని ప్రముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని సమాచారం. రామ మందిరానికి జూన్ 10వ తేదీనే పునాదులు వేయాలని భావించినా కరోనా కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. కాశీ, వారణాసి నుంచి వచ్చే ప్రముఖ పూజారుల సమక్షంలో భూమిపూజ కార్యక్రమం జరగనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి