2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోగానే టీడీపీని వీడి చాలామంది నాయకులు వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అలా మొదట్లో టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి జంప్ కొట్టిన నాయకుల్లో తోట త్రిమూర్తులు కూడా ఒకరు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట…2019 ఎన్నికల్లో చెల్లుబోయిన వేణుగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఆ వెంటనే చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైఎస్సార్‌సీపీలోకి వచ్చేశారు.

 

అయితే తోట రాకతో వైఎస్సార్‌సీపీలో అంతర్గత విభేదాలు వచ్చాయి. అటు చెల్లుబోయిన వేణుగోపాల్, ఇటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు తోట రాకని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే జగన్ మాత్రం ఎవరికి అన్యాయం జరగకుండా తోటని పార్టీలోకి తీసుకొచ్చారు. పైగా తోటకు కూడా మంచి ఛాన్స్ ఇచ్చారు. చెల్లుబోయినకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మొదట తోటని అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడుగా నియమించారు.

 

ఇక మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ, మంత్రి పదవికి రాజీనామా చేసిన పిల్లి సుభాష్‌కు రాజ్యసభ ఇచ్చారు. దీంతో తోటని మండపేట ‌ఇన్‌చార్జ్‌గా నియమించారు. మొన్న ఎన్నికల్లో సుభాష్ మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అటు రామచంద్రాపురం నుంచి గెలిచిన చెల్లుబోయినకు తాజాగా మంత్రి పదవి ఇచ్చారు. తోటకు మండపేట బాధ్యతలు దక్కడంతో ఆయన మళ్ళీ రామచంద్రాపురం వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో చెల్లుబోయినకు ఎలాంటి ఇబ్బంది రాదు. 

 

వచ్చే ఎన్నికల్లో తోట మండపేట నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైపోయింది. త్వరలోనే తోటకు ఎమ్మెల్సీ పదవి కూడా రావోచ్చని తెలుస్తోంది. మొత్తానికి జగన్...తోటకు చాలానే బంపర్ ఆఫర్లు ఇచ్చారనే చెప్పొచ్చు. అయితే తోట ఆ ఆఫర్ నిలబెట్టుకుంటారా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే మండపేటలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు.

 

వరుసగా మూడుసార్లు గెలిచిన వేగుళ్ళకు తోట చెక్ పెట్టడం కష్టమని తెలుస్తోంది. పైగా ప్రతిపక్షంలో ఉన్నా సరే వేగుళ్ళ నియోజకవర్గంలో మంచి పనితీరు కనబరుస్తున్నారు. అటు మండపేటలో కమ్మ ఓట్లతో పాటు, శెట్టిబలిజ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కమ్మ ఓట్లు ఎలాగో టీడీపీకే వస్తాయి. శెట్టిబలిజలు ఎలాగో కాపు సామాజికవర్గానికి చెందిన తోటకు వ్యతిరేకం కాబట్టి, వారు టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. 

 

అయితే మండపేటలో కాపు ఓటింగ్ కూడా బాగానే ఉంది. కానీ కమ్మ, శెట్టిబలిజ వర్గాలు రెండు కలిస్తే కాపులు తక్కువ అయిపోతారు. దీంతో మళ్ళీ కమ్మ సామాజికవర్గానికి చెందిన వేగుళ్ళ విజయం దక్కించుకోవడం సులభమని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: