ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతు సంక్షేమ పాలనే ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 13,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేస్తోంది. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పురుగుమందులు, విత్తనాల విక్రయాలు చేపడుతోంది. 
 
అయితే తాజాగా జగన్ సర్కార్ మరో  కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతు భరోసా కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్న‌దాత‌ల‌కు మంచి ధ‌ర అందించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో మార్కెటింగ్ సేవ‌ల‌ను ప్రవేశపెట్టనుంది. మంత్రి కన్నబాబు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ నిన్న తూర్పు గోదావరి జిల్లాలో ప్రకృతి విధానంలో బీపీటీ 2841 నల్ల రకం బియ్యం సాగును ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మంచి ధరలను అందించాలనే ఉద్దేశంతో సాగుదారుల‌కి , కొనుగోలుదారునికి మధ్య రైతు భరోసా కేంద్రాల్లో మార్కెటింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేయనుందని తెలిపారు. రైతులు వేసిన పంటలకు సరైన ధర లేకపోతే ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేస్తుందని అన్నారు. గత సంవత్సర కాలంలో 10,200 కోట్ల రూపాయల సాయాన్ని రైతుల ఖాతాలలో జమ చేశామని చెప్పారు. 
 
సాగులో కూలీల కొరతను అధిగమించేందుకు ఈ సంవత్సరం 1700 కోట్ల రూపాయలతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. అమలాపురం పార్లమెంట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ తోట త్రిమూర్తులు, వ్యవసాయశాఖ జేడీ కేఎస్‌ఎస్‌.ప్రసాద్, డీడీ రామారావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని మంత్రులు, అధికారులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: