ఏకంగా 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి సీఎం జగన్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రివర్గం ఏర్పాటు చేయడమే కాకుండా రెండున్నర ఏళ్లలో పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని జగన్ ముందే చెప్పి, నాయకులకు షాక్ ఇచ్చారు. అయితే పదవులు పోకుండా ప్రస్తుతం ఉన్న 25 మంత్రులు కష్టపడుతుండగా, నెక్స్ట్ టర్మ్‌లో ఎలా అయిన పదవి దక్కించుకోవాలని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

 

నియోజకవర్గాల్లో దూకుడుగా పనిచేసుకుంటున్నారు. ప్రతిపక్ష టీడీపీకి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ విధంగా మంత్రి పదవి కోసం దూకుడు ప్రదర్శిస్తున్న సీనియర్ ఎమ్మెల్యేల్లో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కూడా ఒకరు. ఈయనకు నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అటు వైఎస్సార్‌సీపీతో విభేదించి, సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం....ప్రసాద రాజుకు మంత్రి పదవి రాబోతుందని ఓ సందర్భంలో చెప్పారు.

 

ఇక ఈ ప్రచారం ఎలా ఉన్నా, ప్రసాదరాజు మాత్రం నరసాపురం అసెంబ్లీ స్థానంలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఆక్వా రైతులని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు రూ. 80 కోట్లతో నరసాపురం నియెజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. అలాగే నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన నర్సాపురం వశిష్ఠ వారధి.. అలాగే బియ్యపుతిప్పలోని మినీ హార్బర్‌, విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు మంచినీటి పైపులైన్లకు త్వరలోనే జగన్ చేత శంకుస్థాపన చేయించేందుకు సిద్ధమవుతున్నారు.

 

అటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. ఇక అధికార పక్ష నాయకుడుగా, ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక ఈ విధంగా దూకుడు పనిచేస్తున్న ప్రసాదరాజుకు, జగన్ మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి చూడాలి జగన్, ప్రసాదరాజుకు తన కేబినెట్‌లో చోటు ఇస్తారో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: