దేశంలో కరోనా మహమ్మారి గడిచిన ఐదు నెలలుగా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ లాక్ 3.0 సడలింపులు అమలులోకి వచ్చాయి. కేంద్రం ఇప్పటికే అన్ లాక్ 3.0కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల విషయంలో నిబంధనలను సడలించింది. అధికారులు అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై ఆంక్షలు పూర్తిగా తొలగించారు.
 
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులు స్పందన వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు అనంతరం ఆటోమేటిక్ గా ప్రయాణికుడి మొబైల్, ఈ మెయిల్ కు ఈ పాస్ వస్తుంది. ప్రయాణికుడు సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర ఈ పాస్ ను, గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు రేపటినుంచి ఆటోమేటిక్ ఈ పాస్ ల జారీ జరుగుతుందని తెలిపారు.
 
రాష్ట్రానికి వచ్చే వారి సంఖ్య తెలుసుకోవడం కోసం ఈ వివరాలను నమోదు చేసుకుంటున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుండి ఏపీలోకి వచ్చే వాహనాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాత మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు. అధికారులు ఈ పాస్ ఉన్న వాహనదారుల నుంచి ఆధార్ నెంబర్, చిరునామాను నమోదు చేసుకుని ఆ తర్వాత మాత్రమే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తారు.
 
ప్రయాణికులలో కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు జరిపి వైరస్ సోకిందో లేదో నిర్ధారించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పాస్ ఉన్నా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఏపీలోకి అనుమతి ఉంటుంది. అత్యసవరమైన వారికి మాత్రం సడలింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు సూచనలు చేసింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,40,933కు చేరగా మృతుల సంఖ్య 1349కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 75,720 యాక్టివ్ కేసులు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: