ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం లాక్ డౌన్ ద్వారా వైరస్ కు చెక్ పెట్టాలని భావిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో బుధవారం నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
 
అధికారులు ఇన్నిరోజులు పరిమిత ఆంక్షలతో ఈ ప్రాంతంలో లాక్ డౌన్ ను అమలు చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌ పోల భాస్కర్‌ నగరంలో కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరగడంతో నగరపాలక సంస్థ పరిధిలో పటిష్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి మరో రెండు వారాల పాటు కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ అమలు కానుంది. అధికారులు నిత్యావసర వస్తువుల కోసం ప్రజలకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతులు ఇచ్చారు.
 
అయితే మెడికల్ షాపులపై మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలపై కూడా ఆంక్షలు విధించటం లేదని ఆ సంస్థలు యథావిధిగా పని చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలు మినహా మిగిలిన సంస్థల్లో ఎటువంటి కార్యకలాపాలకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. తొమ్మిది గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.
 
అధికారులు అత్యవసర సేవల ఉద్యోగులు, విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డులను విధిగా వెంట తెచ్చుకోవాలని చెప్పారు. రెండు వారాలపాటు పక్కాగా ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. కమిషనర్‌ పిడతల నిరంజన్‌రెడ్డి, ఒంగోలు తహసీల్దార్‌ కె.చిరంజీవి నగరపాలక సంస్థ పరిధిలో అమలు చేస్తున్న లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: