బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దూకుడు పెంచింది. రియా సోదరుడుకి డ్రగ్స్ సరఫరా చేసిన కరమ్ జీత్‌ను కూడా ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. రియా సోదరుడు షోవిక్, మిరాండాలకు కరమ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు అధికారులకు గుర్తించారు. మొత్తంగా ఏడుగురు పెడ్లర్లను ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి పెద్ద మొత్తంలో మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి?. ఎవరి కోసం సరఫరా చేస్తున్నారనే కోణంలో విచారణ జరుగుతోంది.

ముంబై డ్రగ్స్ కేసు లింకులు టాలీవుడ్‌లోనూ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రియా కాల్ లిస్ట్ లో తెలుగు సినీ హీరోయిన్లు, హీరోల పేర్లు బయటకు వస్తుంటం సంచలనం రేపుతోంది.  రియాతో డ్రగ్స్ లింకు వ్యవహారంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం వికారాబాద్ శివార్లలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో  రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొంటోంది. డ్రగ్స్ వ్యవహారంలో ఆమె పేరు బయటకు రావడంతో.. షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయింది.  జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటి నుంచి మూడు రోజుల క్రితం షూటింగ్ కోసం వెళ్లింది రకుల్. దీనిపై రకుల్‌ నోరు విప్పడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న రకుల్‌ క్రిష్ దర్శకత్వంలో డీగ్లామర్ రోల్‌లో నటిస్తోంది.

రియాను విచారించిన సమయంలో డ్రగ్ రాకెట్‌తో సంబంధమున్న బాలీవుడ్‌కు చెందిన 25 మంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టినట్టు తెలిసింది. అంతేకాకుండా 25 మంది డ్రగ్స్ దాందాను నిర్వహించే వ్యక్తుల పేర్లను కూడా అధికారులకు చెప్పినట్టు సమాచారం. అయితే ఆ సెలబ్రిటీల జాబితాను ఇప్పటికే తయారు చేసింది ఎన్సీబీ. ఆ లిస్టులో రకుల్‌ ప్రీత్ సింగ్‌ పేరు కూడా ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. త్వరలోనే సమన్లు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 సుశాంత్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని, రియా మత్తుపదార్థాలు వినియోగించేదని నార్కోటిక్స్ కంట్రోలో బ్యూరో దర్యాప్తులో తేలింది. మొదట ఈ ఆరోపణలు తోసిపుచ్చిన రియా ....తర్వాత ఎన్‌సీబీ విచారణలో అసలు విషయం అంగీకరించింది. రెండు రోజుల విచారణలో రియా బాలీవుడ్, టాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగించే 25 మంది పేర్లు వెల్లడించింది.  గోవా నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించిన అధికారులు... డ్రగ్స్ పెడ్లర్స్ వివరాలను ఆరా తీస్తోంది. డ్రగ్స్‌... గోవా నుంచి సుశాంత్ ఇంటికి.. ఆతర్వాత సుశాంత్ ఇంటి నుంచి రియా ఫ్లాట్‌కు వెళ్లినట్లు ఎన్సీబీ గుర్తించింది. రియా పలువరు సినీ సెలబ్రీటలకు డ్రగ్స్ విక్రయించినట్లు పక్కా ఆధారాలను గుర్తించింది. ఆ కోణంలో విచారిస్తున్నారు అధికారులు.

అటు కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్టైన శాండల్ వుడ్ బ్యూటీ సంజనా.. ఆసుపత్రిలో రచ్చ చేసింది. సంజనాకు రక్తపరీక్షలు చెయ్యడానికి పోలీసులు ఆమెను ల్యాబ్ తీసుకెళ్లారు. ఆ సమయంలో రక్తపరీక్షలు చేయించుకోవడానికి సంజనా నిరాకరించింది. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని, తాను ఎందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలి అంటూ.. వైద్యులపై చిందులు వేసింది. తనకు ఎవరిమీద నమ్మకం లేదని.. ఒకవేళ రక్తపరీక్షలు చేసినా ఆ పరీక్ష ఫలితాలు తనవే అనడానికి గ్యారెంటీ ఏమిటి అంటూ నానా హంగామా చేసింది.  రాగిణి, సంజనా డ్రగ్స్ తీసుకున్నామని తమ విచారణలో అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు. వారికి రక్త పరీక్షలు చేసి.. వారి అసలు బండారం బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.




 

మరింత సమాచారం తెలుసుకోండి: