కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పెన్నా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలు ముంచెత్తుతుండడంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. మరి కొన్ని రోజులు వరదలు కొనసాగే అవకాశం ఉండడంతో అప్రమత్తయ్యారు అధికారులు. సహాయ, పునరావాస చర్యల్ని ముమ్మరం చేశారు.
 
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. పులిచింతలకు తోడు మునేరు వాగు నుంచి కూడా భారీగా వరద రావడంతో ప్రకాశం బ్యారేజి దగ్గర వరద ఉధృతి పెరిగింది. దీంతో బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. గంట గంటకు పెరుగుతున్న వరదతో బెజవాడ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.        

వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. తోట్లవల్లూరు మండలం కరకట్ట వెంబడి ఉన్న లంక గ్రామాలైన తోడేళ్లదిబ్బలంక, పాములలంక, కాళింగదిబ్బ, పొట్టిదిబ్బలంక, పిల్లివానిలంక, తుమ్మలపచ్చిలంక తదితర లంకల్లో వరద నీరు చేరింది. రొయ్యూరు, తోట్లవల్లూరు, చాగంటిపాడు, దేవరపల్లి  గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.

కృష్ణమ్మ వరద ఉధృతికి వందలాది ఎకరాల పంట నీటమునిగింది. జగ్గయ్యపేట, నందిగామ, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, ప్రత్తి, మిర్చి, అరటి తోటలకు తీవ్ర నష్టంవాటిల్లింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గని అత్కూరు గ్రామంలో లంక పొలాల్లో  వరి, పత్తి, మిర్చి, పసుపు పంటలు మునిగాయి. చందర్లపాడు మండలం రామన్నపేట గుడిమెట్ల ఏలూరుతో రెండు వందల ఎకరాల వరకు పంట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.        

కరకట్ట లోపల ఉన్న నివాసాలకు దగ్గరగా వరద నీరు రావడంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే వరద నెమ్మదించడంతో చంద్రబాబు ఇంటితో సహా ఇతర నివాసాలు ముంపు ముప్పు నుంచి బయట పడ్డాయి.    
రాయలసీమ జిల్లాల్లో‌ కురిసిన వర్షాలతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమశిల రిజర్వాయర్‌కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదలడంతో పెన్నా మహోగ్రరూపం దాల్చింది. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. మరోవైపు సంగం బ్యారెజ్ పై రాకపోకలు నిషేధించారు.         

కడప జిల్లాలో కుందూనది ఉద్ధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నూలు జిల్లాలో కరకట్టలను దాటి నది ప్రవహిస్తోంది. దీంతో పొలాలు నీటమునిగాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడం వల్ల మరికొన్ని రోజులు వరదలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. సహాయ, పునరావాస చర్యల్ని ముమ్మరం చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: