2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత పార్టీ నాయకులు ఎవరూ ఆమెను పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరించడం, సమావేశాలకు సైతం కనీసం ఆమెను ఆహ్వానించకపోవడం వంటి పరిణామాలు ఆగ్రహం కలిగించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఆమె వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, దుబ్బాకలో గెలిచి తీరాలని కసిగా ఉన్న కాంగ్రెస్ ఆ నియోజకవర్గంలో ఒక్కో మండలానికి పార్టీకి చెందిన ఇద్దరు నుంచి ఐదుగురు వరకు నాయకులను ఇంచార్జిలుగా నియమించింది. వీరిలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలకమైన నాయకులు ఇలా మొత్తం ఎనిమిది మండలాలకు 32 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది.
ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ జాబితాలో విజయశాంతి పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని పూర్తిగా పక్కన పెట్టేసిందా అనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది. కొంతకాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు సైతం పెద్దగా హాజరుకాకపోవడం, ప్రస్తుతం దుబ్బాక ఎన్నికలు జరగబోతున్నా, ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న ఆమె అటు వైపు వచ్చేందుకు ఇష్టపడకపోవడం వంటి పరిణామాలు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. దీనికి తోడు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మాణికం ఠాకూర్ ఇటీవల పార్టీ కీలక నాయకులతో సమావేశం నిర్వహించినప్పుడు ఆమె హాజరుకాలేదు.
ఠాకూర్ స్వయంగా తన వద్దకు వచ్చి తనతో భేటీ అవుతారని విజయశాంతి భావించారు. కానీ ఆ విధంగా జరగకపోవడంతో విజయశాంతి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాజకీయాలలో యాక్టివ్ గా ఉండకపోవటానికి కారణం సినిమాలే అని చెబుతున్న ఆమె కాంగ్రెస్ లో ఉండేందుకు ఇష్టపడడం లేదని, త్వరలోనే ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారనే ప్రచారం అప్పుడే మొదలయిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి