చారిత్రక నగరం... దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గాలి పీల్చుకుంటే ఊపిరే ఆగిపోతుందా అనేంత భయంతో గజగజ వణికిపోతోంది. సమస్త మానవాళికి ప్రాణవాయువైన గాలి .. కాలుష్య రక్కసి కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. ఎటు చూసినా పొగచూరిన నగరమే.. ఎటు వెళ్లినా విషవాయువులే.. నగరమా లేక నరకమా అనే స్థాయిలో ఉంది డిల్లీలో వాయు కాలుష్యం.

మంచు తెరల మధ్య ముత్యంలా మెరవాల్సిన హస్తిన పొగబారిపోయింది. అక్టోబర్‌, నవంబర్‌ నెలలు వస్తున్నాయంటే చాలు ఢిల్లీ ప్రజలు ఊపిరిబిగబట్టుకొని గాలి పీలుస్తున్నారు. గ్యాస్ ఛాంబర్ ను తలపిస్తోంది రాజధాని నగరం. వాయు కాలుష్యం అతి ప్రమాదకర స్థాయికి మించి పెరిగిపోయింది. కనీవినీ ఎరుగని ఎయిర్ ఎమర్జెన్సీకి కేంద్ర బిందువు అవుతోంది ఢిల్లీ.

ప్రపంచ కాలుష్య నగరాల్లో టాప్ 10లో ఉంటుంది ఢిల్లీ నగరం. ఇది చాలు ఇక్కడ పొల్యూషన్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవడానికి. ప్రస్తుతం ఢిల్లీలో చలికాలం నడుస్తోంది. దీంతో నగరాన్ని చుట్టుముట్టిన పొగ ఎటూ కదలకుండా ఇక్కడే ఉండిపోతోంది. చలికాలంలో ఉదయం పదకొండు గంటల వరకు ఢిల్లీలో సూర్యుడు కనిపించడు. ఉదయమంతా మంచు పరచుకుని కశ్మీర్ ను తలపిస్తుంది. కానీ కళ్లతో చూసేదంతా నిజం కాదు. ఇదంతా పొగమంచు కాదు.. కోరలు చాచుకొని ఉన్న  కాలుష్య మేఘం.

ఢిల్లీలో 20కిపైగా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మీటర్లున్నాయి. ప్రతి మీటర్లోనూ రికార్డైన రీడింగ్ అతిప్రమాదకర స్థాయి కంటే ఎక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహానగరాల జాబితాలో ఢిల్లీకి ఐదో స్థానం. జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద నగరం ఢిల్లీ. ఇటు చారిత్రకమే కాదు అటు రాజకీయంగానూ ఎంతో ప్రాముఖ్యత గల ఈ నగరం ప్రస్తుతం అత్యంత ప్రమాకర పరిస్థితుల్లో ఉంది. ఒకటీ రెండు ప్రాంతాలు కాదు.. నగరమంతా కాలుష్యపు గుప్పెట్లో చిక్కుకుని పోయింది. మరీ కొన్ని ప్రాంతాలైతే మనుషుల మనుగడే సాధ్యం కాని దుస్థితి ఉందనడం అతిశయోక్తి కాదు.



మరింత సమాచారం తెలుసుకోండి: