ఈ వర్షాకాలంలో రైతులు ఏ పంట సాగు చేయాలి అనేది ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఏ  భూమిలో ఏ పంట సాగు చేస్తే  దిగుబడి ఎక్కువ వస్తుందని ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇక ప్రభుత్వం సూచించిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తాము  అంటూ కూడా నిబంధన పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎంతో మంది రైతులకు సన్నరకం వరి సాగు చేయాలని నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం చెప్పినట్టుగానే ఎంతో మంది రైతులు వేల ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. ఈసారి దిగుబడి ఎక్కువ వస్తుందని అనుకున్నా రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది.



 ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పంట పూర్తిస్థాయిలో ధ్వంసం అవ్వగా... చేతికొచ్చిన పంట కూడా మద్దతు ధర లేకపోవడంతో రైతుల పాలిట శాపంగా మారింది. ఇక మరోపక్క దోమకాటు సహ తెగుళ్లతో  సరైన దిగుబడి కూడా రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే ఎంతో కష్టపడి అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టి పంట వేసిన రైతులు అందరికీ ఈ సన్న రకం వరి మరింత అప్పులపాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం చెప్పినట్లుగా తాము సన్న రకం వరి పండించినందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తమను ఆదుకోవాలని పలువురు రైతులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఘటనలు ఎన్నో తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే.



 ఇక ప్రభుత్వం చెప్పినట్లుగా సన్న రకం వరి సాగు చేసినందుకుగాను కనీసం తమ పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు అని భావిస్తున్న రైతులు కొన్నిప్రాంతాల్లో ఏకంగా బాధతో నిండి పోయిన హృదయంతో పంట  కాల్చేస్తున్నారు. గతంలో దొడ్డు రకం వరి సాగు చేసిన సమయంలో కాస్తో కూస్తో లాభాలను ఆర్జించాము అంటూ చెబుతున్న రైతులు.. ఈసారి ప్రభుత్వం సూచించినట్లుగా సన్న రకం వరి సాగు చేయడం ద్వారా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామని  ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.,.

మరింత సమాచారం తెలుసుకోండి: