ఆంధ్రప్రదేశ్ లోని సాగునీటి ప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్-2 పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్, కాలువల పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు అధికారులు. పోలవరం ప్రాజెక్టు అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంతకు ముందే కాఫర్ డ్యామ్ పనులను పూర్తి చేయాలని సూచించారు.
విశాఖ తాగునీటి అవసరాలను తీర్చేలా పోలవరం నుంచి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు సీఎం. పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని తెలిపారు. ప్రాజెక్టులో నీరు 41.15 అడుగులకు చేరినా బ్యాక్ వాటర్‌తో సమస్యలు రాకూడదన్నారు సీఎం.
అంతేకాకుండా ప్రాజెక్టుకు ఎటువంటి సమస్యలు లేకుండా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి జగన్. నిర్వాసితులకు సైతం ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులపైనా సీఎం సమీక్షించారు. మొత్తానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి దశగా అడుగులు వేస్తున్నారు. రైతుల పక్షపాతిగా తన పాలనలో ప్రత్యేకతను చాటుకున్న ఆయన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా యన భావిస్తున్నారు. ప్రతీ అడుగు ప్రజల కోసమే వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి