గ్రేటర్ లో ప్రచార పర్వం ముగిసిపోవడంతో అభ్యర్థులు ప్రలోభ పర్వానికి తెరతీస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పార్టీ తరపున నగదు పంచుతున్న కొంతమందిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రచారం ముగిసి, పోలింగ్ కి ఒక్కరోజే సమయం ఉండటంతో.. ఓటర్లను ఆకర్షించేందుకు, నగదు సరఫరా సాఫీసా సాగేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. అయితే వీటన్నిటికి చెక్ పెడుతూ పోలీస్ డిపార్ట్ మెంట్ ముందునుంచీ ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామంటున్నారు ఉన్నతాధికారులు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లలో ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్ 84, సైబరాబాద్ 38, రాచకొండ పరిధిలో 28, హైదరాబాద్ సిటీలో 4,979 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 50 వేల మందితో భారీ పోలీస్ భద్రతతో పాటు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో.. 1,704 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 1,085 అత్యoత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు పోలీసులు. గ్రేటర్ వ్యాప్తంగా 50 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1500 మంది రౌడీషీటర్ల బైండోవర్ చేశారు. ఎన్నికల సందర్భంగా 3,744 వెపన్స్ డిపాజిట్ అయ్యాయి. జోన్ల వారిగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారిగా ఇంచార్జ్‌ ఏసీపీ, సీఐలను నియమించారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన నేతలపై 55 కేసులు నమోదయ్యాయి. పోలీసుల తనిఖీల్లో భారీగా పలుచోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిషనరేట్స్‌ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ టీవీ మానిటరింగ్‌ టీమ్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బాడీ వార్మింగ్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు. గ్రేటర్ ఎన్నికలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఈ దఫా పోలీసులు మరింత జాగ్రత్తతో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: