హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఏ1 నిందితురాలిగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఏ2గా సుబ్బారెడ్డి, ఏ3గా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. భార్గవ్ రామ్ బెంగళూరులో తలదాచుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడి పోలీసుల సహాయంతో భార్గవ్ రామ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా భార్గవ్ రామ్‌కు అత్యంత దగ్గరగా ఉండే బంధువులు, స్నేహితులు ఇతరుల ఇళ్ల పైన పోలీసులు నిఘా పెట్టారు. మరోపక్క విచారణలో భాగంగా పోలీసులకు అనేక విషయాలు తెలిశాయి. ఈ కిడ్నాప్ కేసులో వీరితో పాటు మాడాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను అనే మరో వ్యక్తి కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలుసుకున్నారు. గుంటూరు శ్రీను భార్గవ్ రామ్‌కు ప్రధాన అనుచరుడని పోలీసులు గుర్తించారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల విషయంలో అన్ని వ్యవహారాలను గుంటూరు శ్రీను దగ్గర ఉండి చూసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు ఈ కిడ్నాప్ ప్లాన్ అఖిల ప్రియ, భార్గవ్ రామ్‌ది అయినప్పటికి దగ్గర ఉండి అమలు చేసింది మాత్రం గుంటూరు శ్రీనేనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ గుంటూరు శ్రీను పలువురిని కిడ్నాప్‌లు చేసినట్టు తెలుస్తోంది. ప్రవీణ్ రావును కిడ్నాప్ చేయాలని ఆరు నెలల క్రిందటే గుంటూరు శ్రీను పక్కా స్కెచ్ వేసినట్టు అర్థమవుతోంది. ఆరు నెలల నుంచి ప్రవీణ్ రావు కదలికలను గుంటూరు శ్రీను పసిగడుతూ వచ్చాడని, నకిలీ నెంబర్లతో ఉన్న వాహనాలతో తిరుగుతూ సీసీ ఫుటేజ్ కూడా లేకుండా జాగ్రత్త పడినట్టు పోలీసులు తెలుసుకున్నారు. అసలు గుంటూరు శ్రీను ఎవరు.. గతంలో ఇతడిపై ఎన్ని కేసులు ఉన్నాయి అనే దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి