ముంబై: సినిమాలను చూసి నిజ జీవితంలో చాలా మంది మర్డర్లు చేస్తుంటారనేది తెలిసిన విషయమే. మరోపక్క సినిమా కథలకు నిజ జీవితాల్లో జరిగే సంఘటనలే ప్రేరణగా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే ఏ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశాన్ని చూసి ఉండరు. తీస్తే మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది ఈ కథ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్మాల్కర్ అనే 34 ఏళ్ల నిందితుడు 32 ఏళ్ల వయసున్న అమితా మోహితే ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి ఇంట్లోనూ ఒప్పుకున్నారు. అంతా బాగుందని అనుకునే సరికి అమిత అదృశ్యమైపోయింది. గత ఏడాది అక్టోబర్ 21న హర్మాల్కర్‌ను కలిసేందుకు వెళుతున్నానంటూ అమిత తన ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వచ్చింది.

అంతే.. ఆ తర్వాత అమిత ఏమైపోయిందో ఎవరికి తెలియదు. కానీ.. ఆమె వాట్సాప్ నుంచి కుటుంబ సభ్యులకు హర్మాల్కర్‌ను పెళ్లి చేసుకున్నట్టు ఓ మెసేజ్ వచ్చింది. ఆ తరువాత హర్మాల్కర్ కూడా కనిపించకుండా పోయాడు. అయితే గత వారం మాత్రం అమిత సోదరుడికి హర్మాల్కర్ ఓ రోడ్డు మీద కనిపించాడు. అమిత గురించి అడిగినా ఏం చెప్పకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు హర్మాల్కర్ చెప్పే సమాధానాలకు విసుగెత్తిపోయారు. హర్మాల్కర్ ఏదో దాస్తున్నాడన్న విషయం అర్థమైపోయి తమదైన శైలిలో విచారించగా.. అమితను హత్య చేసినట్టు చెప్పేశాడు. తనకు ముందే పెళ్లి అయిందని, ఈ విషయం తెలియక అమిత తనను వివాహం చేసుకోమంటూ వేధిస్తుండటం వల్లే ఆమెను చంపేశానని చెప్పాడు.

ఆమె శవం కనిపించకుండా చేసేందుకు తనకు దృశ్యం సినిమానే స్ఫూర్తి అని కూడా చెప్పాడు. ఆ సినిమా స్పూర్తితో తన ఇంట్లోని అటక పైన అమిత మృతదేహాన్ని పెట్టి చుట్టూ గోడ కట్టేసినట్టు తెలిపాడు. మృతదేహం నుంచి వాసన రాకుండా ఉండేందుకు సిమెంటు, సున్నంలో యాంటీ లీకేజీ గ్లూ కూడా కలిపినట్టు వివరించాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. నిందితుడి ఇంటికి వెళ్లి గోడను పగుల గొట్టగా వారికి ఓ అస్థి పంజరం కనిపించింది. అస్థి పంజరాన్ని డీఎన్ఏ పరీక్షలకు పంపి.. నిందితుడిపై పలు కేసులు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: