మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ఘట్టం ఈ రోజు మొదలైంది. ప్రశాంతంగా కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. కరోనా నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం ఓటు వేయడానికి ఆసక్తి చూపుతారో అని అనుకుంటున్నా సమయంలో... పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు వేయడం కోసం పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. పోలింగ్ బూతుల దగ్గర క్యూ కట్టి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  మొత్తంగా చూస్తే 29,732 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. తొలి రెండు గంటల్లో 18 శాతం వరకు పోలింగ్ నమోదు అయినట్లు అధికారిక సమాచారం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.

అయితే ఆంధ్రాలో 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో చాలా మంది మొదటిసారిగా ఓటు వేయబోతున్నారు. కాగా ఇలా మొదటి సారి తమ ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్ ఉంటోంది... కాస్త డిఫరెంట్ అనిపిస్తే చాలు సెల్ఫీ మీద సెల్ఫీలు తీసుకోవడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం అలవాటైపోయింది. కానీ ఈ అలవాటు ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కుదరదు అంటున్నారు అధికారులు. సెల్ఫీలు సంగతి పక్కన పెడితే ...పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం నిషేధం.

ఎవరైనా ఈ రూల్ ను అతిక్రమించి ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో సెల్ఫీలు తీసుకుంటే...  17(A) ప్రకారం వారి ఓటును రద్దు చేస్తారు. అంతేకాదు అలా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి. కాబట్టి ఫస్ట్ టైం ఓటర్స్ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ తీసుకెళ్ళకండి. ఇక పోలింగ్ కేంద్రంలో వారి అభ్యర్థుల తరపున నినాదాలు చేయడం, వారికి జేజేలు పలకడం, అభ్యర్థికి సంబంధించిన ఫోటోలు, కరపత్రాలు నేరుగా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం నిషేధం. అలా చేస్తే ఎన్నికల నియమావళి అతిక్రమించిన కారణంగా అధికారులు కఠిన చర్యలు  తీసుకుంటారు. కాబట్టి కొత్తగా ఎవరైతే ఓటు వేస్తున్నారో వారు ఈ విషయాన్ని తెలుసుకుని ఫాలో అవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: