కోర్టు కేసులతో కొన్నినెలలు వాయిదా పడ్డా.. ఎట్టకేలకు ప్రతిష్టాత్మతంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభించారు సీఎం జగన్. వివాదాలున్న ప్రాంతాల్లో పట్టాలు పంపిణీ చేయకుండా.. మిగతా చోట్ల ఈ కార్యక్రమం పండగలా సాగిందని చెప్పారు. ఇళ్ల పట్టాలిచ్చారు, ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కూడా ఇచ్చారు. మరి ఏపీలో ఇళ్ల నిర్మాణం ఎలా సాగుతోంది. ప్రభుత్వం అనుకుంటున్నట్టుగానే సజావుగా నడుస్తోందా? లేక పట్టాల పంపిణీతోనే ఆ హడావిడి ఆగిపోయిందా..?

ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల పునాదుల వరకు నిర్మాణాలు జరగగా.. మరికొన్ని చోట్ల భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నారు లబ్ధిదారులు. సొంత స్థలం, పొజిషన్‌ సర్టిఫికెట్లు కలిగిన లబ్ధిదారులు వారు కోరుకున్న కొలతల్లో ఇళ్లు నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అయితే జగనన్న కాలనీలు అనే పేరుతో వెలసిన కొత్త లేఅవుట్ లలో మాత్రం నిర్ణీత కొలతల ప్రకారమే ఇల్లు నిర్మించుకోవాలనే కండిషన్ పెట్టారు అధికారులు.

రాష్ట్రవ్యాప్తంగా 68,361 ఎకరాల్లో ఇలా కొత్తగా వేసిన లే అవుట్లు ఉన్నాయి. సుమారు 17,005 లే అవుట్లలో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే చాలామంది నిర్మాణ పనులు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట లే అవుట్‌ లో లబ్ధిదారులు ఇటీవల పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ పునాదులు తీశారు. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురంలో ఇళ్ల పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో వాటికి అవసరమైన ఇసుక, సిమెంట్‌ కొరత రాకుండా చూసే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు.

ఇబ్బందులు ఎదురయితే.. సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది ప్రభుత్వం. మరోవైపు లబ్ధిదారుల్లో అవగాహన పెంచేందుకు గృహ నిర్మాణ సంస్థ సిబ్బంది వారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తమ్మీద ఇళ్ల నిర్మాణాలన్నీ ప్రారంభమయ్యాయని, త్వరలోనే వీటిని పూర్తి చేస్తామని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: