ఆస్ట్రేలియాలోని విక్టోరియా లో లాన్స్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఓ వింత జీవి కనిపించింది. ఆ జీవికి బాగా బొచ్చు ఉండటంతో అది ఏ జీవి అనే విషయం అర్థం కాక ఆ వ్యక్తి చాలా భయపడి పోయాడు. ఇది ఖచ్చితంగా గ్రహాంతర వాసి అయి ఉంటుందని అనుకున్నాడట. కానీ కొంచెం ధైర్యం చేసి ముందుకి వెళ్ళగా ఆయనకు దట్టమైన బొచ్చులో ఓ గొర్రె మొహం కనిపించింది. ఇంకాస్త పరిశీలించి చూడడంతో అది ఒక అడవి గొర్రె అని తెలిసింది. చాలా సంవత్సరాల పాటు ఉన్ని కత్తిరించక పోవడం కారణంగా.. ఆ అడవి గొర్రె గుర్తుపట్టలేనంతగా అందవిహీనంగా తయారయిందని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.


ఐతే గొర్రె ఉన్ని లో వస్తువుల తో పాటు ధూళి దుమ్ము పేరుకుపోయాయి. ఆ ఉన్ని చాలా బరువు ఉండటంతో ఈ అడవి గొర్రె పైకి నిలుచొలేకపోతుంది. కాళ్లలో బాగా మట్టి కూరుకుపోవడంతో అది ముందుకు కూడా నడవలేకపోతుంది. అయితే దాని దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి వెంటనే 'ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీ' బృందానికి సమాచారం అందించాడు. దీంతో అడవి జంతువులను సంరక్షించే ఆ బృందం ఘటనా స్థలానికి వచ్చి గొర్రెను తమతోపాటు తీసుకెళ్లారు.



అనంతరం దట్టంగా పెరిగిన ఆ అడవి గొర్రె ఉన్ని ని చాలా జాగ్రత్తగా కట్ చేశారు. దీనితో ఆ గొర్రె తన బరువైన ఉన్ని ని ఎట్టకేలకు వదిలించుకోగలిగింది. ఆరోగ్యం గానే ఉన్న ఈ గొర్రె ప్రస్తుతం చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. అయితే ఆ గొర్రె నుంచి కట్ చేసిన ఉన్ని 34.5 కిలోల బరువు ఉందని ఎడ్గర్ మిషన్ ఫామ్ శాంక్చుయరీ అధికారులు వెల్లడించారు. అంత బరువైన ఉన్నితో గొర్రె ఎలా బతికిందో తమకు అర్థం కావడం లేదని అక్కడి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నలభై రెండు కిలోల ఉన్నితో నరకయాతన అనుభవిస్తున్న ఓ అడవి గొర్రె ని కూడా జంతు సంరక్షణ అధికారులు కాపాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: