నాగార్జున సాగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులోనూ వరుసగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో.. నాగార్జున సాగర్ సిట్టింగ్ స్థానాన్ని ఒడిసి పట్టుకోవాలని చూస్తోంది టీఆర్ఎస్. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందని భావించినా.. ఇంకా స్పష్టత రావట్లేదు. అయితే ఎన్నిక ఎప్పుడు జరిగినా కూడా సన్నద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అధినేత కేసీఆర్.

3 నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ లో అభ్యర్థి ఎంపిక కసరత్తు ఇంకా కొనసాగుతోంది. తాజాగా కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తారని అనుకున్నా.. అది కుదిరేలా లేదు. నర్సింహయ్య కొడుకు భగత్ ‌కు కు మరో రకంగా న్యాయం చేస్తామని అంటున్నారట కేసీఆర్. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, స్థానిక నేత కోటిరెడ్డి పేర్లు సైతం పార్టీ కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది.

కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎదురయ్యే పోటీని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్న కేసీఆర్‌ అభ్యర్థి ఖరారు విషయంలో మాత్రం ఆచితూచి అడుగువేస్తున్నారు. ఇదివరకే మండలాల వారీగా పార్టీ ఇన్‌ చార్జిలను నియమించి కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మూడు నెలలుగా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ పరిస్థితితో పాటు, కాంగ్రెస్, బీజేపీ కదలికలపై కూడా ఎప్పటికప్పుడు కేసీఆర్ కి నివేదికలు అందజేస్తున్నారు. నేడో రేపో ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో తాజాగా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ మున్సిపల్‌ మేయర్‌కు క్షేత్రస్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ వారిని ఇన్‌చార్జీలను నియమించారు. ఎన్నికలు ముగిసేవరకు సాగర్‌ నియోజకవర్గంలోనే ఉండాలని ఇన్‌ చార్జీలను కేసీఆర్‌ ఆదేశించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: