బడ్జెట్ అంటేనే అంకెల గారడీ, కీలక రంగాలు- వాటికి ప్రభుత్వం చేసిన కేటాయింపులు, ఏ ఏ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వం ఏ ఏ పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. అన్నదాన్ని బట్టే బడ్జెట్ ఎలా ఉందో విశ్లేషిస్తారు. యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే ఆంధ్రా రాష్ట్ర భవిష్యత్తుపై కాస్త భయం కలగడం ఖాయం.
యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత నిరాశజనకంగా ఉంది.. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదు.. ఎందుకంటే.. ఆ మాట ఆయనే చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాటలు వింటే.. ఏపీ ఫ్యూచర్ పై భయం కలుగక మానదు. కీలకమైన రంగాలకు కూడా ధాటిగా నిధులు కేటాయించలేని నిస్సహాయ స్థితి పాపం యనమలది.
ఇక్కడ ఆంధ్రావాసులు భయపడాల్సింది యనమల సామర్థ్యం గురించి కానీ.. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి కానీ కాదు.. ఏపీ రాష్ట్ర ఆదాయ పరిస్థితి గురించి. ఎన్నికల్లో ప్రకటించిన ప్రతిష్టాత్మక పథకాలు, పోలవరం, రాజధాని నిర్మాణం వంటి బృహత్తర కార్యాలుంటే.. వాటిలో పదోవంతు నెరవేర్చేందుకు కూడా రాష్ట్రం దగ్గర ఆదాయం లేదు.
నవ్యాంధ్ర ఆశలు ఆకాశంలో ఉంటే.. ఆదాయం పాతాళంలో ఉంది. మరి ఈ రెండింటికీ లంగరు ఎలా వేస్తారు.. ఈ దూరాన్ని ఎలా తగ్గిస్తారు.. జవాబులేని ప్రశ్నలివి.. సాధారణంగా ఈనాడు దినపత్రిక అంటే.. చంద్రబాబు సర్కారుకు అనుకూలం అన్న ముద్ర ఉంది. కానీ బడ్జెట్ పై ఈనాడు వెలువరించిన కథనాలు చూస్తే.. ఆంధ్రా రాష్ట్ర అగమ్యగోచర స్థితి కళ్లుకు కడుతుంది. కాస్తో కూస్తో అనుకూలంగా ఉంటే చాలు.. దాన్ని పదింతలు చేసి చూపే అనుకూల మీడియానే బడ్జెట్ పై ఆ స్థాయిలో రాసిందంటే.. వాస్తవం ఇంకెలా ఉందో ఊహించుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి