ఉపాధి లభించాలంటే పరిశ్రమలు రావాలి. ఉన్న పరిశ్రమలే కాదు.. కొత్త రకంగా పరిశ్రమలు రావాలి. కొత్త రంగాల్లోకి సేవలు విస్తరించాలి. అప్పుడే యువతకి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. కేంద్రం కూడా ఇప్పుడు ఇదే దృక్పథంతో ఆలోచిస్తోంది. అందుకోసం కొత్త రంగాలను అన్వేషిస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటోంది.
అందుకే దేశంలో పెద్ద ఎత్తున విమాన మరమ్మతులను చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన విధానాన్ని ఆవిష్కరించింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పార్లమెంటులో వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్ సేవలు అరకొరగా మాత్రమే ఉన్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఎంఆర్‌వో సేవలపై వసూలు చేసే అత్యధిక జీఎస్టీ, దేశంలో అంతర్జాతీయ ఆమోదం పొందిన మెయింటెన్స్ సౌకర్యాలు లేమి, విమానాలు లీజు అగ్రిమెంట్లలో ఉండే నిబంధనలు వంటి కారణాల వలన దేశంలో ఎంఆర్‌వో సేవలు విస్తృతికి అవరోధంగా నిలిచాయి.
అందుకే ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది ఏప్రిల్ నుంచి ఎంఆర్‌వో సేవలపై విధిస్తున్న జీఎస్టీని కేంద్రం తగ్గిస్తోంది. ఏఏఐ ప్రవేశపెట్టిన నూతన ఎంఆర్‌వో విధానంతో రెండేళ్ళ ఈ రంగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో పౌర, సైనిక విమానాల మరమ్మతుల కోసం ఎంఆర్‌వో సేవలను ప్రవేశపెట్టేందుకు హెచ్‌ఏఎల్-ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ సంయుక్తంగా పని చేస్తాయి. ఈ మేరకు వాటి మధ్య గత ఫిబ్రవరిలో ఎంవోయూ కుదిరింది.
దేశంలో ఈ ఎంఆర్‌వో సేవలను విస్తృతపరిచేందుకు ఎయిర్‌బస్, బోయింగ్ సంయుక్తంగా జిఎంఆర్, ఎయిర్ వర్క్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్‌తో కలిసి ప్రాట్ అండ్ విట్నే సంస్థ విమాన ఇంజన్ మరమ్మతుల సేవలను కూడా ప్రారంభించింది. నానో ఏవియేషన్ సంస్థ చెన్నైలో తొలిసారిగా బోయింగ్ 777 విమానాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి విడి భాగాలను ఎగుమతి చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి