సాధారణంగా గుళ్లు ఎక్కడ ఉంటాయి.. ఎత్తైన ప్రదేశాల్లో కొండల్లో కోనల్లో ఉంటుంటాయి. అక్కడ ప్రకృతిరమణీయత ఆధ్యాత్మికతకు మరింత శోభనిస్తుందని అలా ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పుడు ఓ దేవుడు ఏకంగా అంతరిక్షంలోనే కొలువుదీరబోతున్నాడు. అక్కడి నుంచి పూజలు అందుకోబోతున్నాడు. కేవలం పూజలే కాదు.. భూమిపై నుంచి భక్తులు పంపే కోరికల చిట్టాలు అంతరిక్షం నుంచే స్వీకరించబోతున్నాడు.. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది కొన్నేళ్లలోనే నిజం కాబోతోంది. మరి ఆ వివరాలేంటో చూద్దామా..


ఇప్పుడు అంతరిక్షం మనిషికి మరీ అంత దూరంలో ఏం లేదు.. ఒకప్పుుడు ఉపగ్రహప్రయోగాలు కేవలం ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగేవి.. కానీ ఇప్పుడు ప్రైవేటు సంస్థలు కూడా ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నాయి. ఈ సౌకర్యాన్నే ఉపయోగించుకుని ఏకంగా తమ దేవుడినే అంతరిక్షానికి పంపుతున్నారు కొందరు బౌద్ద సన్యాసులు. అంతరిక్షంలోనూ  తమ దేవుడికి ఆలయం ఉండాలని  జపాన్‌లోని క్యోటోలో ఉన్న డయ్‌గోజి దేవాలయంలోని సన్యాసులు  సంకల్పించారు.


మరి మనిషి తలచుకుంటే కానిదేముంటుంది.. అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు కోసం వారు ఓ శాటిలైట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీని సంప్రదించారు. టెర్రా స్పేస్‌‌ అనే కంపెనీ శాటిలైట్లను తయారు చేసే కంపెనీ వీరి ప్రతిపాదనకు ఆమోదించింది. ఈ కంపెనీ ఓ శాటిలైట్‌లో జొటెనిన్‌ గౌంజీ పేరుతో ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. దేవాలయం అంటే భారీగా ఉండదులెండి.  చిన్నపాటి డబ్బా రూపంలో ఉండే దేవాలయాన్ని రూపొందిస్తారు. అందులో చిన్న బుద్ధుడి విగ్రహం పెడతారు.  దీన్ని శాటిలైట్‌లో పెట్టి అంతరిక్షంలోకి పంపుతారు.


ఈ శాటిలైట్‌లో బుద్ద దేవాలయం మరో రెండేళ్లలో పూర్తవుతుందట. అంతరిక్షంలో  ఆలయం ఏర్పాటు చేశాక దాన్ని డయ్‌గోజీ ఆలయ పూజారులు భూమి నుంచే నిర్వహిస్తారు. భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా తమ కోరికలు డయ్‌గోజీ పూజారులకు పంపిస్తే.. వాటిని అంతరిక్షంలోని శాటిలైట్‌లో ఉన్న దేవాలయానికి పంపిస్తారు. అవి అక్కడి మెమొరీ డివైజ్‌లో నిక్షిప్తవుతాయట. ఈ సంగతి తెలిస్తే ఇక మన హిందూ దేవాలయాల ప్రతినిధులూ ఇదే ఆలోచన చేస్తారేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: