కరోనా సెకండ్ వేవ్‌ను అదుపు చేయలేని మోడీ సర్కారు నిర్లక్ష్యంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ పత్రికలు కొన్ని ఇప్పటికే మోడీ నిర్వాకాన్ని ఎండగట్టాయి. ఇప్పుడు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్‌సెట్‌ కూడా మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కడిగిపారేస్తూ ఓ ఎడిటోరియల్ రాసింది. సెకండ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా మోడీ ఎన్నికలపై దృష్టి సారించారని.. ప్రస్తుత భారత సంక్షోభానికి నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణమని కడిగిపారేసింది.


కరోనా కట్టడిలో మొదటిలో కొన్ని విజయాలు సాధించినా... భారత్ వాటిని నిలుపుకోలేకపోయిందని ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ అభిప్రాయపడింది. ఏప్రిల్‌ వరకు కేంద్ర ప్రభుత్వ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఒక్కసారి కూడా సమావేశం కాలేదని.. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రస్తుతం రోజూ దేశంలో నాలుగు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు వస్తున్నాయని ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ మండిపడింది.


దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో మోడీ సర్కారు కరోనా కట్టడి గురించి వదిలేసి.. విమర్శకులను శిక్షించేపనిలో పడిందని లాన్సెట్ విమర్శించింది. ప్రధాని మోదీ సంక్షోభ సమయంలో విమర్శలను నిలువరించడానికి ప్రయత్నిస్తూ, బహిరంగంగా చర్చకు దూరంగా ఉండటం దారుణమని విమర్శించింది. మున్ముందు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం దేశం నలు మూలల నుంచి లక్షల మంది ఒక్కచోట గుమికూడేందుకు వీలు కల్పించే మతపరమైన సూపర్‌స్ప్రెడర్‌ కార్యక్రమాలకు పచ్చజెండా ఊపిందని... దానికితోడు భారీ రాజకీయ ర్యాలీలకు అనుమతిచ్చిందని లాన్సెట్ విమర్శించింది. కొవిడ్‌ నియంత్రణ చర్యలపై దృష్టి సారించలేకపోయిందని రాసింది.


దేశంలో వ్యాక్సినేషన్ కూడా నత్తనడకన సాగుతోందని లాన్సెట్ విమర్శించింది. ఇప్పటికైనా జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని నాయకత్వ పటిమను అందిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తేనే మహమ్మారిపై విజయం సాధ్యమవుతుందని హితవుపలికింది. ఇందుకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరించాలని సూచించింది. టీకా కార్యక్రమ వేగాన్ని పెంచడం ఒకటైతే, వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం మరొకటి అని అభిప్రాయపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: