ఆ 46 వీడియోలే కీలకం..
రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో అధికార పక్షం తీవ్రంగా స్పందించింది. ఆయనపై ఎవరూ కక్షసాధింపులకు పాల్పడలేదని, ప్రభుత్వంపై ఆయన చేసిన తీవ్ర విమర్శల కారణంగానే కేసులు నమోదయ్యాయని తెలిపారు నేతలు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలే రఘురామ కృష్ణంరాజు రాజద్రోహం చేశారా లేదా అనే విషయాన్ని బట్టబయలు చేస్తాయని చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రఘురామకృష్ణంరాజు కేసులో సీఐడీ ఏకంగా 46 వీడియోలను కోర్టు ముందు సమర్పించిందని చెప్పారు అంబటి. మరోవైపు రఘురామ అరెస్ట్ ను ఖండిస్తున్న చంద్రబాబుపై కూడా ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, రఘురామకృష్ణంరాజుది అపవిత్ర బంధం అంటూ మండిపడ్డారు. కోర్టులో ఎంపీ నిజాలు చెబితే.. తన బండారం బయటపడుతుందేమోనని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.
ఎంపీ రఘురామకృష్ణంరాజు మహానటుడని, తనకు తాను గాయాలు చేసుకుని బయట పడాలని ప్రయత్నించగల సమర్థుడని అన్నారు అంబటి రాంబాబు. రచ్చబండ పేరుతో ప్రభుత్వంపై నిందలు వేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారని చెప్పారు. రఘురామ వ్యవహారాల వెనక చంద్రబాబు హస్తం ఉందని, చంద్రబాబుకి వత్తాసు పలికే ఎల్లో మీడియా కూడా రఘురామకు అనుకూలంగా కథనాలిస్తోందని అన్నారు. రఘురామకృష్ణంరాజు రాజద్రోహం చేశారో లేదో చెప్పాల్సింది కోర్టు అని, చంద్రబాబు కాదని అన్నారు అంబటి. సీఐడీ పోలీసులు కోర్టుకి సమర్పించిన 46 వీడియోలే ఈ కేసులో కీలకం అని, వాటి ద్వారా ఎంపీ రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి నిందలు వేశారో, ఎలాంటి అసత్య ప్రచారాలకు తెరతీశారో అర్థమవుతుందని అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి