ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల విషయంలో కూడా వైసీపీ-టీడీపీల మధ్య పెద్ద రచ్చే జరిగింది. వైసీపీ ప్రభుత్వం ఒకరోజే బడ్జెట్ సమావేశాలు పెట్టడంతో, ఆ సమావేశాన్ని ప్రతిపక్ష టీడీపీ బహిష్కరించింది. అలాగే ఏ పని పాట లేనట్లు జూమ్ యాప్‌లో మాక్ అసెంబ్లీ పెట్టుకున్నారు.
అయితే ప్రభుత్వం ఒకరోజు సమావేశాన్ని పెట్టి, బడ్జెట్ ప్రవేశపెట్టేసి చేతులు దులుపుకుంది. దీంతో ప్రభుత్వంపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బడ్జెట్ అంతా అంకెల గారడీ అని, అభివృద్ధి అంశాన్ని విస్మరించారని విమర్శలు చేశారు. అలాగే అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. జూమ్ యాప్‌లో పెట్టిన మాక్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓ రేంజ్‌లో జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
అదే సమయంలో టీడీపీ పెట్టిన మాక్ అసెంబ్లీ సురభి నాటకాన్ని తలపిస్తుందని వైసీపీ విమర్శలు చేసింది. ఎవరికి వారే సీఎం, మంత్రులు, స్పీకర్ అన్నట్లుగా డ్రామా వేశారని సెటైర్లు వేశారు. ఈ విధంగా రెండు పార్టీల నాయకుల మధ్య విమర్శలు నడిచాయి. అయితే ఇక్కడ వైసీపీ పరిస్తితి ఎలా ఉన్నా టీడీపీ చేసే పనులు కాస్త ఎబ్బెట్టుగానే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. అలాగే సీఎం జగన్ కాలు బయట పెట్టకుండానే పంచాయితీ, మున్సిపాలిటీ, తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ భారీ విజయాలని సొంతం చేసుకుంది.
ఇతర రాష్ట్రాల సీఎంలు కరోనా సమయంలో ప్రజల కోసం తిరుగుతున్నా సరే, జగన్ కాలు బయటపెట్టడం లేదు. అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం ప్రజల కోసం బయటకు వచ్చినట్లు కనబడటం లేదు. అయితే వారికి రాకపోయినా పెద్దగా సమస్య లేదు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఏం చేయాలో అది చేస్తున్నారు. కానీ టీడీపీకి బయటకు రావాల్సిన అవసరముంది.
ఇలాంటి సమయాల్లో ప్రజలకు అండగా నిలబడితే పార్టీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అది వదిలేసి బాబు హైదరాబాద్‌కే పరిమితమై జూమ్ యాప్‌లో మీటింగులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. అటు టీడీపీ నాయకులు సైతం ప్రజల్లో కనిపించడం లేదు. దీంతో పార్టీకి మరింత ఇబ్బందులే వచ్చేలా ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు మారకుండా, జూమ్‌లో కూర్చుని జగన్‌ని తిట్టడం వల్ల ప్రయోజనం ఏమి లేదంటున్నారు. జగన్‌కు ఎలాగో ప్రజల మద్ధతు ఉంది. కాబట్టి బాబు మారితే బెటర్ అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి